ఒత్తిడిలో టీమిండియా.. చేపాక్ లో గెలిచేదెవరో ?

by Disha Web Desk 1 |
ఒత్తిడిలో టీమిండియా.. చేపాక్ లో గెలిచేదెవరో ?
X

దిశ, వెబ్ డెస్క్: ఆసిస్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా ఆఖరి మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్‌ ఫలితాన్ని తేల్చేందుకు ఇరు జట్లు బుధవారం స్థానిక చెపాక్‌ స్టేడియంలో తలపడనున్నాయి. సొంత గడ్డపై వరుస సిరీస్‌లను గెలుస్తూ వస్తున్న భారత జట్టు ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌ విభాగం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనకు గరిచేస్తోంది. అటు ఆసీస్‌ నుంచి స్టార్క్‌ పేస్‌ను.. మార్ష్‌ బాదుడును సమర్థంగా ఎదుర్కొంటేనే ఫలితంపై ఆశలు ఉండే పరిస్థిత నెలకొంది.

సూర్యకు మరోసారి అవకాశం..

టీ20ల్లో మొనగాడిగా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో మాత్రం జట్టుకు భారంగా మారాడు. సిరీస్‌లో ఇప్పటిదాకా ఒక్క పరుగు కూడా చేయలేక గోల్డెన్‌ డకౌట్లయ్యాడు. వరల్డ్‌కప్‌ ఆలోచనల్లో ఉండేందుకు బహుశా అతడికిదే ఆఖరి అవకాశం కావచ్చు. అటు ఓపెనర్లు గిల్‌, రోహిత్‌లతో పాటు విరాట్‌ కోహ్లీలనుంచి భారీ సోర్లు రాకపోవడం నిరాశపరుస్తోంది. తొలి మ్యాచ్‌లో రాహుల్‌ అర్ధసెంచరీ సాధించినా విశాఖలో తేలిపోయాడు. పేసర్‌ స్టార్క్‌ స్వింగ్‌కు మన స్టార్‌ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో అతడిని దీటుగా ఎదుర్కోవాలంటే పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాల్సిందే. మూడో స్పెషలిస్ట్‌ పేసర్‌గా శార్దూల్‌ లేక ఉనాద్కట్‌లలో ఒకరిని తీసుకుంటారా? లేక ముగ్గురు స్పిన్నర్లతోనే ఆడతారా? అనేది వేచి చూడాల్సిందే.

ఫుల్ జోష్ లో ఆస్ట్రేలియా జట్టు..

బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో దుమ్మురేపుతున్న ఆసీస్‌ సిరీస్‌ను పట్టేయాలనే కసితో ఉంది. ఓపెనర్లు మిచెల్‌ మార్ష్‌, ట్రావిస్‌ హెడ్‌ల నుంచి వారికి అద్భుత ఆరంభం లభిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో వార్నర్‌ ఆడితే, మార్ష్‌ మిడిలార్డర్‌లో రావొచ్చు. అలాగే లబుషేన్‌ స్థానంలో మ్యాక్స్‌వెల్‌ ఆడొచ్చు. బౌలింగ్‌లో పేసర్‌ స్టార్క్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సవాల్‌గా మారింది. అతడికి మరో ఎండ్‌లో ఎబాట్‌, ఎల్లిస్‌, స్టొయినిస్‌ సహకరిస్తున్నారు.

తుది జట్లు (అంచనా):

భారత్‌: గిల్‌, రోహిత్‌ (కెప్టెన్‌), విరాట్‌, సూర్యకుమార్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, అక్షర్‌, షమి, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌.

ఆస్ట్రేలియా: వార్నర్‌, హెడ్‌, స్మిత్‌ (కెప్టెన్‌), మార్ష్‌, క్యారీ, గ్రీన్‌, మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌, ఎబాట్‌/ఎల్లిస్‌, స్టార్క్‌, జంపా.

పిచ్‌, వాతావరణం

చిదంబరం పిచ్‌ సహజంగా స్పిన్నర్లకు సహకరిస్తుంది. అందుకే మధ్య ఓవర్లలో పరుగులు తీయడం కష్టం. ఇక్కడ పూర్తిగా జరిగిన 21 వన్డేల్లో సగటు స్కోరు 250. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ తీసుకునే అవకాశం ఉంది. ఇక మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.


Next Story

Most Viewed