ఆసియా కప్‌లో గిల్ వైస్ కెప్టెన్.. శ్రేయాస్, జైస్వాల్‌కు అన్యాయం..?

by Phanindra |

ఆసియా కప్ టీంలో శ్రేయాస్, జైస్వాల్‌కు అన్యాయం జరిగింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా కూడా వారిని సెలెక్టర్లు పట్టించుకోలేదు.

ఆసియా కప్‌లో గిల్ వైస్ కెప్టెన్.. శ్రేయాస్, జైస్వాల్‌కు అన్యాయం..?
X

దిశ, స్పోర్ట్స్: వచ్చే నెల 9వ తేదీ నుంచి 28వ తేదీ వరకు యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. అంతా అనుకున్నట్లే టెస్టుల్లో మంచి ఫామ్ కనబరిచిన శుభ్‌మన్ గిల్‌ టీ20 టీంల్లో కూడా పునరాగమనం చేశాడు. అక్షర్ పటేల్‌ను కాదని, అతనికే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు అగార్కర్ ప్రకటించాడు. వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో గిల్‌నే వైస్ కెప్టెన్‌గా నియమించామని, ఆ తర్వాత గిల్ ఈ ఫార్మాట్లో ఆడలేదని అగార్కర్ గుర్తుచేశాడు. ఇప్పుడు అతను రీఎంట్రీ ఇవ్వడంతో ఆటోమేటిక్‌గా అతనికే వైస్ కెప్టెన్సీ ఇచ్చినట్లు వెల్లడించాడు.

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్‌కు ఈ జట్టులో చోటే దక్కలేదు. ఐపీఎల్‌లో తన బ్యాటింగ్‌తోపాటు, కెప్టెన్సీతో కూడా అయ్యర్ ఆకట్టుకున్నాడు. జైస్వాల్ కూడా ధనాధన్ ఇన్నింగ్సులతో మెప్పించాడు. అలాంటి వారిని జట్టులోకి తీసుకోకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే వీళ్లిద్దరికీ అవకాశం దక్కకపోవడం నిజంగా దురదృష్టకరమని అగార్కర్ అన్నాడు. ‘అభిషేక్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దానికితోడు తను బౌలింగ్ కూడా చేయగలడు. అదే అతనికి ప్లస్ అయింది. ఇక అయ్యర్ విషయంలో కూడా దురదృష్టమనే చెప్పాలి. అతన్ని మిడిలార్డర్‌లో ఎవరి స్థానంలో తీసుకోగలం చెప్పండి?’ అని ఆయన అడిగాడు. వీళ్లతోపాటు వాషింగ్టన్ సుందర్ వంటి ఆల్‌రౌండర్‌ను కూడా సెలెక్టర్లు పక్కన పెట్టడం గమనార్హం.

Next Story