- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : రెండేళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ మళ్లీ వచ్చేసింది. నేటి నుంచి ప్రపంచకప్ పండుగ మొదలుకానుంది. ఈ సారి భారత్, శ్రీలంకలలో ఈ మెగా సందడి జరగనుంది. ఐసీసీ టోర్నీల్లో పొట్టి ప్రపంచకప్‌కు ఉండే క్రేజ్ వేరు. మెరుపులు మెరిపించే బ్యాటర్లు.. బుల్లెట్ లాంటి బంతులను సంధించే బౌలర్లు.. ఫీల్డింగ్ విన్యాసాలు..ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్‌లు, సూపర్ ఓవర్‌లు.. ఇలా టీ20 వరల్డ్ కప్ అంటే అభిమానుల్లో ఆసక్తి ఎక్కువే. 2024లో టీమిండియా 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగడం, అది కూడా సొంతగడ్డపై ఆడటంతో భారత ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మరోసారి టీమిండియా ప్రపంచకప్ ముద్దాడాలని ఆశిస్తున్నారు. టీ20ల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్ ఈ ప్రపంచకప్‌లో స్పష్టమైన ఫేవరెట్.
భారత్‌కు తిరుగుందా?
టీ20ల్లో టీమిండియా తిరుగులేని ప్రదర్శన చేస్తోంది. 2023 నుంచి భారత జట్టుకు ఎదురేలేదు. ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం. 12 ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడితే అందులో 11 మనవే. మరో సిరీస్‌ను డ్రా చేసుకుంది. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్య సేన జోరు మరింత పెరిగింది. ఆసియా కప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఇటీవలే న్యూజిలాండ్‌ను 4-1తో చిత్తు చేసి తమ తడాఖా ఏంటో చూపించింది. దీంతో టీమిండియాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అవి జట్టు ప్రదర్శనను దెబ్బతీసేంతవి కావని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సూర్య సేన అత్యున్నత స్థాయిలో ఉంది. గ్రూపు దశను దాటడం భారత్‌కు నల్లేరు మీద నడకే. భారత్‌తో మ్యాచ్‌ను పాక్ బాయ్‌కాట్ చేయడంతో రెండు పాయింట్లు ఖాతాలో చేరుతాయి. ఇక మిగితా ప్రత్యర్థులు నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా వంటి పసికూనలే కావడంతో టీమిండియా సూపర్-8కు చేరుకోవడానికి పెద్దగా కష్టం ఉండకపోవచ్చు. అయితే, టోర్నీలో అడ్డంకులు లేకపోలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌లతో కూడా జాగ్రత్తగా ఆడకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి, ప్రతి మ్యాచ్‌లోనూ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేయాల్సిన అవసరముందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
భారత్, పాక్ పోరు లేనట్టేనా?
భారత్, పాక్ మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. కానీ, ఈ ప్రపంచకప్‌లో దాయాదుల పోరు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తున్నది. భారత్, పాక్ ఒకే గ్రూపులో ఉండగా ఈ నెల 15న కొలంబోలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఆ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటేనే మ్యాచ్ జరుగుతుంది. తాజా పరిస్థితులను చూస్తే నాకౌట్‌లో కూడా వీరి మధ్య పోటీ ఉండకపోవచ్చు. కాబట్టి, క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇది నిరాశ కలిగించే విషయమే.
యూఎస్‌ఏ ఎంత వరకు..
వరల్డ్ కప్‌లో భారత జట్టు తమ ప్రయాణాన్ని యూఎస్‌ఏతో మొదలుపెట్టనుంది. ఏ రకంగా చూసుకున్నా ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు నల్లేరు మీద నడకే. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ భీకర ఫామ్‌లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివమ్ దూబెలు కూడా టచ్‌లోనే ఉండటంతో బ్యాటింగ్ దళం అత్యంత పటిష్టంగా ఉంది. బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో కీలకం కానున్నారు. అయితే, యూఎస్‌ఏను పూర్తిగా తీసిపారేయడానికి లేదు. గత టీ20వరల్డ్ కప్‌లో పాక్‌ను ఓడించింది. ఇటీవల వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించినంత పని చేసింది. అంతకుముందు భారత్ ఏ మ్యాచ్‌లో కూడా గట్టిపోటీనే ఇచ్చింది. బ్యాటర్లు గౌస్, సాయితేజ, సంజయ్, మిలింద్ కుమార్ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లలో సౌరభ్, హర్మీత్ సింగ్ ఆ జట్టుకు కీలకం. మని యూఎస్‌ఏ ఎంత వరకు భారత్‌ను నిలువరించగలుగుతుందో చూడాలి.
ఫార్మాట్ ఇలా..
టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. గత పొట్టి ప్రపంచకప్ మాదిరిగానే ఈ సారి కూడా 20 జట్లు బరి ఉన్నాయి. 20 టీమ్‌ను ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూపులో ప్రతి జట్టు మిగతా నాలుగు టీమ్‌లతో ఒక్కోసారి తలపడుతుంది. ప్రతి గ్రూపులో టాప్-2 టీమ్‌లు అంటే 8 జట్లు సూపర్-8 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. అందులో నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విడిపోయి ఆడతాయి. ఆ రౌండ్‌లో ప్రతి జట్టూ మిగతా మూడు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూపుల్లో టాప్-2 జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి.
గ్రూపులు.. జట్లు
గ్రూప్-ఏ : భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూపు-బి : ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్
గ్రూపు-సి : ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ, స్కాట్లాండ్
గ్రూపు-డి : న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ






