- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిల్ 2.0.. విమర్శలకు నోళ్లు మూయించిన టీమిండియా కెప్టెన్
ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : విమర్శించిన వాళ్ల నోళ్లు మూయిస్తే.. వాళ్లే ప్రశంసించేలా చేస్తే..నీ సామర్థ్యాన్ని ప్రశ్నించిన వారికి నీ సత్తా ఏంటో చూపిస్తే.. ఎలా ఉంటుంది. ఆ కిక్కే వేరు కదా.. బహుశా టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా అలాంటి ఫీలింగ్‌నే అనుభవిస్తున్నాడేమో.. గిల్‌కు భారత టెస్టు జట్టు పగ్గాలు అప్పగించిన తర్వాత కొందరు అతని నియామకంపై పెదవి విరిచారు. పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. బ్యాటర్‌గా అతని సామర్థ్యాన్ని ప్రశ్నించారు. ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ విమర్శకులకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చి వాళ్ల నోళ్లు మూయించాడు.
రెండో టెస్టులో టీమిండియాను కెప్టెన్ గిల్ ముందుండి నడిపించాడు. తొలి టెస్టులో పరాజయాన్ని మరిపించేలా భారత జట్టు ఎడ్జ్‌బస్టన్‌లో అదరగొట్టింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు. సారథిగా అద్భుతంగా నడిపించాడు. కానీ, ఇప్పుడే గిల్ కెప్టెన్సీ గురించి విశ్లేషించలేం. రెండు టెస్టులకే నాయకత్వం వహించాడు కాబట్టి అతని కెప్టెన్సీపై ఓ అంచనాకు రాలేం. కానీ, బ్యాటర్‌గా అతని గురించి మాత్రం కచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. టెస్టు పగ్గాలు అప్పగించిన తర్వాత గిల్ తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. పలువురు మాజీ క్రికెటర్లు అతని బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నించారు. గణాంకాలను చూపిస్తూ విమర్శలు గుప్పించారు. అవును.. ఇంగ్లాండ్ పర్యటన వెళ్లకుముందే గిల్ ప్రదర్శన అంతంత మాత్రమే. 32 టెస్టుల్లో 1,893 రన్స్ చేశాడు. సగటు 35.05. విదేశాల్లో అతని పర్ఫామెన్స్ ఇంకా పేలవం. ఇంగ్లాండ్‌లోనైతే 6 టెస్టుల్లో 14.67 సగటుతో 88 రన్సే చేశాడు. దీంతో పలువురు ముందుగా బ్యాటర్‌గా నిరూపించుకోవాలని సూచించారు.
రెండు టెస్టులతోనే అంతా మార్చేశాడు
విమర్శల నోళ్లూ మూయించడానికి గిల్‌కు ఎంతో సమయం పట్టలేదు. తన సామర్థ్యాన్ని ప్రశ్నించిన వారికి కేవలం రెండు టెస్టుల్లోనే తన సత్తా ఏంటో నిరూపించాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 585 రన్స్ చేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీ, రెండు భారీ శతకాలు ఉన్నాయి. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 147 రన్స్ చేశాడు. ఇక, రెండో టెస్టులోనైనా మరో గిల్‌ను చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(69)తో కదం తొక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 161 పరుగులు చేశాడు. ఎడ్జ్‌బస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 430 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్ అతనే. అలాగే, టెస్టులో 250+, 150+ రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్‌కు ముందు 35.05గా ఉన్న అతని సగటు 40కి చేరింది.
కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకుని..
‘నేను బ్యాట్స్‌మెన్‌గానే ఆడతా. నిర్ణయాలు కూడా బ్యాటర్‌గానే తీసుకుంటా. కెప్టెన్‌గా ఆలోచిస్తే కొన్ని సార్లు రిస్క్‌లు తీసుకోలేరు.’అని సిరీస్ ప్రారంభానికి ముందు గిల్ చెప్పాడు. ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడో ఇప్పుడు అర్థమైంది. కెప్టెన్సీ ఒత్తిడితో రాణించడం అంత తేలికైన విషయం కాదు. కానీ, సారథ్య ఒత్తిడిని గిల్ సమర్థవంతంగా అధిగమించాడనే చెప్పాలి. కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తొలి టెస్టులోనే అతను సెంచరీ బాదాడు. సారథ్యం వహిస్తున్న తొలి టెస్టులోనే శతకం బాదడం నిజంగా అంత సులభం కాదు. దీన్ని గిల్ తొలి టెస్టుకే పరిమితం చేయలేదు. తొలి టెస్టులో ఓటమి పాలైతే ఏ కెప్టెన్‌పైనే ఒత్తిడి రెండింతలు అవుతుంది. గిల్‌పై కూడా కచ్చితంగా ఒత్తిడి పెరగడం సహజమే. కానీ, రెండో టెస్టులోనూ గిల్ ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. తొలి టెస్టుతో పోలిస్తే ఇంకా రెండో టెస్టులోనే అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. ద్విశతకంతోపాటు సెంచరీ బాదాడు. ఇంగ్లాండ్ బౌలర్లను అతను ఎదుర్కొన్న తీరు అద్భుతం. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా చూడచక్కని షాట్లతో అలరించాడు. గిల్ ఇలాగే రాణిస్తే మరింత ఉన్నత శిఖరాలకు చేరుతాడు.
- Tags
- gill
- ind vs eng






