- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెమీస్‌కు అమ్మాయిలు.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో కివీస్ చిత్తు
మహిళల వన్డే వరల్డ్ కప్ సెమీస్‌కు అమ్మాయిలు చేరుకున్నారు. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చేసి ముందంజ వేశారు.

దిశ, స్పోర్ట్స్: మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియా అమ్మాయిలు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ మహిళలపై పూర్తి ఆధిపత్యం చెలాయించి 53 పరుగుల తేడాతో విజయం సాధించారు. గత రెండు మ్యాచులుగా అద్భుతంగా రాణిస్తున్న ఓపెనర్ స్మృతి మంధాన (109) సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (122) వరల్డ్ కప్‌లో తొలి శతకంతో మెరిసింది. వీరికితోడు జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. వీరి మెరుపులతో వర్షం కారణంగా 49 ఓవర్లకు కుదించిన మ్యాచులో భారత్ 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోరు చేసింది.
మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగులకు కుదించారు. అయితే అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత అమ్మాయిలు న్యూజిల్యాండ్ బ్యాటర్లను కుదురుకోనివ్వలేదు. ఆరంభంలోనే సుజీ బేట్స్ (1) అవుటవగా.. కాసేపు క్రీజులో నిలబడని ప్లిమ్మర్ (30), అమీలియా కెర్ (45) భారీ స్కోర్లు చేయకుండా భారత్ అడ్డుకుంది. కెప్టెన్ సోఫీ డివైన్ (6) విఫలమవగా.. బ్రూక్ హలిడే (81), ఇజబెల్లా గేజ్ (65 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడారు. కానీ చేయాల్సిన రన్ రేట్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. దీంతో భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో మిగతా బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో నిర్ణీత 44 ఓవర్లలో కివీస్ 8 వికెట్ల నష్టానికి 271 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. స్నేహ్ రాణా, శ్రీ చరణి, దీప్తి శర్మ, ప్రతీక రావల్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటుతో అద్భుతంగా రాణించడంతోపాటు మూడు క్యాచులు అందుకున్న స్మృతి మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
కాన్ఫిడెన్స్ పెంచే విక్టరీ..
ఈ విజయంతో భారత జట్టు వరల్డ్ కప్ సెమీఫైనల్స్ చేరుకుంది. టోర్నీలో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుందనుకున్న టీమిండియా.. వరుసగా మూడు మ్యాచులు ఓడి సెమీస్ చేరే అవకాశాలను క్లిష్టతరం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో న్యూజిల్యాండ్ వంటి క్వాలిటీ టీంపై బలమైన ప్రదర్శన ఈ టీంకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది.
సంక్షిప్త స్కోరు బోర్డు
టీమిండియా: 340/3 (49 ఓవర్లలో)
ప్రతీక రావల్ (122), స్మృతి మంధాన (109), జెమీమా రోడ్రిగ్స్ (76 నాటౌట్)
బౌలింగ్: సూజీ బేట్స్ (1/40), అమీలియా కెర్ (1/69), రోస్‌మేరీ మైర్ (1/52)
న్యూజిల్యాండ్: 271/8 (44 ఓవర్లలో)
బ్రూక్ హలిడే (81), అమీలియా కెర్ (45), ఇజబెల్లా గేజ్ (65 నాటౌట్)
బౌలింగ్: రేణుకా సింగ్ (2/25), క్రాంతి గౌడ్ (2/48)






