చెలరేగిన భారత బ్యాటర్లు.. సఫారీలపై టీమిండియా గెలుపు

by Phanindra |

సౌతాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో భారత బ్యాటర్లు చెలరేగారు. కిషన్, పాండ్యా మెరుపులతో భారత్ గెలిచింది.

చెలరేగిన భారత బ్యాటర్లు.. సఫారీలపై టీమిండియా గెలుపు
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచులో సౌతాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ సూర్యకుమార్.. బౌలర్లను పరీక్షించాలని అనుకుంటున్నామని, అందుకే ముందుగా బ్యాటింగ్ చేస్తున్నామని చెప్పాడు. అదే సమయంలో సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి అభిషేక్ శర్మ (24)కు తోడుగా ఇషాన్ కిషన్ (53)తో ఓపెనింగ్ చేయించారు. అభిషేక్ నెమ్మదిగానే ఆడినా.. కిషన్, తిలక్ వర్మ (45) అద్భుతంగా ఆడారు. తిలక్‌ను జాన్సెన్ క్లీన్‌బౌల్డ్ చేయగా.. సూర్య (30) క్యాచ్ అవుటయ్యాడు. అక్షర్ పటేల్ (35 నాటౌట్) అజేయంగా నిలిచాడు. హార్దిక్ (10 బంతుల్లో 30)ను బాష్ అవుట్ చేశాడు. కిషన్ రిటైర్డ్ అవుట్‌గా వెనుతిరగ్గా.. అభిషేక్ రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 240/5 పరుగుల భారీ స్కోరు చేసింది.

రాణించిన బౌలర్లు..

మంచు ప్రభావం ఉన్నా కూడా భారత బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. సఫారీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (38) ధనాధన్ ఆటతో ఆ టీంకు మంచి ఆరంభం అందించి రిటైర్డ్ అవుట్‌గా వెనుతిరిగాడు. మరో ఓపెనర్ జార్జ్ లిండే(0)ను అర్షదీప్ తొలి ఓవర్లోనే అవుట్ చేశాడు. ర్యాన్ రికెల్టన్ (44)ను వరుణ్ పెవిలియన్ చేర్చాడు. డెవాల్డ్ బ్రెవిస్ (2), డేవిడ్ మిల్లర్ (13) విఫలమవగా.. జేసన్ స్మిత్ (35), ట్రిస్టన్ స్టబ్స్ (45 నాటౌట్), మార్కో జాన్సెన్ (31) రాణించారు. అయితే సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ రెండు వికెట్లతో రాణించాడు. అర్షదీప్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసుకున్నారు.

Next Story