- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తాచాటిన జ్యోతి.. తైవాన్ ఓపెన్‌లో బంగారు పతకం కైవసం
అంతర్జాతీయ వేదికపై తెలుగమ్మాయి, భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజి సంచలన ప్రదర్శన కొనసాగుతోంది.

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ వేదికపై తెలుగమ్మాయి, భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజి సంచలన ప్రదర్శన కొనసాగుతోంది. ఇటీవలే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన జ్యోతి తాజాగా తైవాన్ ఓపెన్ అథ్లెటక్స్‌లోనూ అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల 100 మీటర్ల హార్డిల్స్‌లో బంగారు పతకం గెలిచింది. 12.99 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని విజేతగా నిలిచింది. జ్యోతి ఆరంభంలో కాస్త వెనుకబడింది. ఫైనల్ హార్డిల్స్‌కు ముందు ఆమె టాప్-2లో కూడా లేదు. కానీ, చివరి సెకన్లలో మెరుపు వేగంతో దూసుకొచ్చి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ ప్రదర్శనతో జ్యోతి వరల్డ్ ర్యాంకింగ్స్ మెరుగుపడటంతోపాటు వరల్డ్ చాంపియన్‌షిప్ అవకాశాలు కూడా మెరుగుపడతాయి.
ఈ టోర్నీలో జ్యోతితోపాటు ఇతర అథ్లెట్లు కూడా సత్తాచాటారు. మహిళల 1,500 మీటర్ల ఈవెంట్‌లో పూజ(4:11.65) విజేతగా నిలిచింది. పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్ కూడా స్వర్ణం సాధించాడు. మూడో ప్రయత్నంలో 16.21 మీటర్ల ప్రదర్శన చేసి అగ్రస్థానంలో నిలిచాడు. పురుషుల 110 మీటర్ల హార్డిల్స్‌లో తేజస్ షిర్సే 13.52 సెకన్ల సీజన్ బెస్ట్ ప్రదర్శన చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే, 4x100 మీటర్ల మహిళల రిలే ఈవెంట్‌లో తెలంగాణ అమ్మాయి నిత్య గంధె బృందం బంగారు పతకం సాధించింది. నిత్య, సుదీక్ష, అభినయ రాజరాజన్, స్నేహలతో కూడిన భారత మహిళల రిలే జట్టు 44.07 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. అలాగే, ఈ ప్రదర్శనతో కొత్త చాంపియన్‌షిప్ రికార్డు కూడా నెలకొల్పింది. మరోవైపు, పురుషుల 4x100 మీటర్ల ఈవెంట్‌లో గురిందర్‌వీర్ సింగ్, అనిమీశ్ కుజుర్, మణికంఠ, అమ్లాన్ బోర్గోహైన్‌లతో కూడిన భారత జట్టు 38.75 సెకన్లతో విజేతగా నిలిచింది. దీంతో శనివారం ఒక్క రోజే భారత్ ఖాతాలో ఆరు బంగారు పతకాలు చేరాయి. ఆదివారం కూడా పలు ఈవెంట్లు జరగనున్నాయి.






