- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టేబుల్ టెన్నిస్‌కు శరత్ కమల్ రిటైర్మెంట్.. ఆ టోర్నీనే చివరిదని ప్రకటన
భారత దిగ్గజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు, ఖేల్‌రత్న అవార్డు గ్రహిత ఆచంట శరత్ కమల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు, ఖేల్‌రత్న అవార్డు గ్రహిత ఆచంట శరత్ కమల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ టేబుల్ టెన్నిస్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నెలలో జరగబోయే డబ్ల్యూటీటీ కంటెండర్ చెన్నయ్ టోర్నీతో ఆటకు ముగింపు పలకనున్నట్టు వెల్లడించాడు. బుధవారం నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో శరత్ కమల్ మాట్లాడుతూ.. ‘నేను నా తొలి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ చెన్నయ్‌లోనే ఆడాను. నా చివరి ఇంటర్నేషల్ టోర్నీ కూడా చెన్నయ్‌లో ఆడబోతున్నా. ఫ్రొఫెషనల్ అథ్లెట్‌గా ఇదే నా చివరి టోర్నీ. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లలో పతకాలు సాధించాను. కానీ, ఒలింపిక్ మెడల్ గెలవలేకపోయాను. యువ క్రీడాకారుల ద్వారా ఆ కలలో ఉంటాను. టేబుల్ టెన్నిస్ నుంచి పూర్తిగా వెళ్లిపోతాను అని చెప్పడం లేదు. కానీ, పెద్ద టోర్నీలు, భారీ జన సమూహాలకు మాత్రం ముగింపే. నా రాకెట్‌కు కాస్త విశ్రాంతినివ్వాల్సిన సమయం ఆసన్నమైంది. క్రీడ నాకు అందించిన ఆనందానికి, ప్రేమకు, బాధకు, నేర్పిన పాఠాలకు, ప్రజలకు కృతజ్ఞతలు.’ అని శరత్ కమల్ చెప్పాడు.
రెండు దశాబ్దాల ప్రస్థానం
42 ఏళ్ల శరత్ దాదాపు రెండు దశాబ్దాలకుపైగా భారత టాప్ ప్లేయర్‌గా తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. తెలుగు మూలాలు ఉన్న కుటుంబంలో ఉన్న కుటుంబంలో జన్మించిన అతను రెండేళ్ల వయసులో రాకెట్ పట్టాడు. 2002లో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆటలో దిగ్గజంగా ఎదిగిన శరత్ అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించిన సందర్భాలు ఎన్నో. 10సార్లు నేషనల్ చాంపియన్‌షిప్ టైటిల్స్ దక్కించుకున్నాడు. కామన్వెల్త్ గేమ్స్‌ల్లో సత్తాచాటిన అతను 13 పతకాలు గెలిచాడు. అందులో ఏడు స్వర్ణాలు మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. 2018 ఆసియా గేమ్స్‌లో రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించాడు. ఐదుసార్లు ఒలింపిక్స్‌ల్లో పాల్గొన్నాడు. చివరిసారిగా పారిస్ విశ్వక్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే, ఒలింపిక్స్ మెడల్ మాత్రం అతనికి కలగానే మిగిలింది. అతని సేవలకు గానూ భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీతో, 2019లో అర్జున అవార్డుతో, 2022లో అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్నతో సత్కరించింది. ప్రస్తుతం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 42వ స్థానంలో ఉన్న శరత్ భారత టాప్ ర్యాంక్ ప్లేయర్‌గానే కెరీర్‌ను ముగించబోతున్నాడు. ఈ నెల 25 నుంచి 30 వరకు డబ్ల్యూటీటీ కంటెండర్ చెన్నయ టోర్నీ జరగనుంది. శరత్ చివరిసారిగా ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నాడు.
- Tags
- Sharath Kamal






