సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి.. ఈ నాలుగు కారణాలే దెబ్బ కొట్టాయి

by Harish |

సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి.. ఈ నాలుగు కారణాలే దెబ్బ కొట్టాయి
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో ఒక్క ఓటమి టీమిండియా టైటిల్ డిఫెన్స్ ఆశలను సన్నగిల్లేలా చేసింది. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్ ప్రదర్శన అంత ఘోరంగా ఉంది మరి. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి ఊహించింది కాకపోయినా భయం మాత్రం అభిమానుల్లో ఉంది. ఎందుకంటే గ్రూపు దశలో భారత్ చిన్న జట్లతోనే ఆడింది. పాక్ మాత్రమే పెద్ద జట్టు. నమీబియా, నెదర్లాండ్స్ వంటి పసికూనలపై కూడా సూర్య సేన తడబడటం చూశాం. తీరా సౌతాఫ్రికా వంటి బలమైన టీమ్‌ ఎదురుపడటంతో భారత జట్టు జట్టు బోల్తా పడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాది వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపించింది. తుది జట్టు ఎంపిక నుంచి మైదానంలో వ్యూహరచన, ప్రదర్శన వరకు జట్టు ఫెయిల్ అయ్యిందని మాజీలు విశ్లేషిస్తున్నారు.

అక్షర్‌ను పక్కనపెట్టడం

జట్టు సెలెక్షన్‌లో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను పక్కపెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు 3 మ్యాచ్‌ల్లో 6 వికెట్లతో అతను మంచి ప్రదర్శననే చేశాడు. కానీ, టీమ్ మేనేజ్‌మెంట్ అనూహ్యంగా అతన్ని తప్పించి వాషింగ్టన్ సుందర్‌కు చాన్స్ ఇచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల కోసం పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడనే ఉద్దేశంతో అతన్ని తీసుకున్నట్టు కోచ్ తెలిపారు. కానీ, ఆ వ్యూహం దెబ్బకొట్టింది. డికాక్, రికెల్టన్‌లను పవర్ ప్లేలోనే బుమ్రా అవుట్ చేయగా.. మరో లెఫ్ట్ హ్యాండర్ మిల్లర్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. దీంతో సుందర్‌ను తీసుకున్న ఉద్దేశం పనిచేయలేదు. ఆకట్టుకున్నాడంటే అదీ లేదు. 2 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. బ్యాటింగ్‌లో కూడా 11 రన్స్ చేశాడు. అనుభవజ్ఞుడైన అక్షర్ చేజింగ్‌లో ఒత్తిడిని అధిగమించేవాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత టీ20 వరల్డ్ కప్‌‌లో సౌతాఫ్రికాతోనే జరిగిన ఫైనల్‌లో కోహ్లీతో కలిసి అక్షర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

20/3 నుంచి 187/7

సౌతాఫ్రికా 187 రన్స్ చేసిందంటే తప్పు భారత బౌలర్లదే. మొదట మార్‌క్రమ్, డికాక్, రికెల్టన్ త్వరగానే అవుటవడంతో సౌతాఫ్రికా 20 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ జట్టు 150 రన్స్ లోపే ఆలౌట్ అవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ, భారత బౌలర్లు అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నారు. బుమ్రా, అర్ష్‌దీప్ బాగానే బౌలింగ్ చేసినా మిగతా బౌలర్లు రాణించలేదు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె ధారాళంగా పరుగులు ఇచ్చేశారు. పిచ్‌కు తగ్గట్టు బంతులు సంధించలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో పాండ్యా 20 రన్స్ ఇచ్చాడు. దీంతో సౌతాఫ్రికా 187 పరుగుల భారీ స్కోరు చేయడం వల్ల భారత్‌పై ఒత్తిడి పెరిగింది.

స్లో బాల్స్.. పెవిలియన్‌కు క్యూ

ఓటమికి పేలవ బ్యాటింగ్‌ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేదన్ని వాస్తవమే. రెండు ఇన్నింగ్స్‌లు చూస్తే ఇది అర్థమవుతుంది. కానీ, అదే పిచ్‌పై మిల్లర్, బ్రెవిస్, స్టబ్స్ ధాటిగా ఆడారు. కానీ, మన బ్యాటర్లు మాత్రం క్రీజులోనే నిలువలేకపోయారు. భారీ షాట్ ఆడటం క్యాచ్ అవుటవడం.. భారత బ్యాటర్లు అవుటైన తీరు ఇలాగే ఉంది. బౌలింగ్‌లో సౌతాఫ్రికా పక్కా ప్రణాళికతో దిగింది. సాధారణంగా దక్షిణాఫ్రికా బౌలర్లు ఎంగిడి, జాన్సెన్ 140+ కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తారు. కానీ, ఈ మ్యాచ్‌లో 110 కి.మీ వేగంతో బంతులు సంధించారు. స్లో బాల్స్ వేశారు. సఫారీల బౌలింగ్‌ను భారత బ్యాటర్లు అంచనా వేయడంలో విఫలమయ్యారు. భారీ షాట్‌‌లకు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యారు. అభిషేక్, తిలక్, సూర్య, సుందర్, పాండ్యా అందరూ ఇలా అవుటైన వారే.

రింకు 8వ స్థానంలోనా?

రింకు సింగ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ స్థానంలో పంపడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో అతను బ్యాటింగ్‌కు వచ్చే సమయానికి మ్యాచ్ చేజారింది. 35 బంతుల్లో 102 రన్స్ లక్ష్యం ఉన్నప్పుడు అతను క్రీజులోకి వచ్చాడు. అప్పుడు క్రీజులో కుదురుకోవడానికి కూడా అతనికి టైం లేదు. దీంతో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుటయ్యారు. స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన రింకును 8వ స్థానంలో పంపడమేంటి? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆల్‌రౌండర్ అయిన సుందర్‌ను ఏమో 5వ స్థానంలో పంపించారు. 5వ స్థానంలో రింకు బ్యాటింగ్‌కు వస్తే పరిస్థితి మరోలా ఉండేదని విశ్లేషకులు అంటున్నారు.

Next Story