T20 World Cup-2026: ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-04 16:41:21  IST  )

T20 World Cup-2026: ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫస్ట్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. సౌతాఫ్రికాతో జరిగిన పోరులో కివీస్ సేన అద్భుత ప్రదర్శనతో విక్టరీ కొట్టి అహ్మదాబాద్‌లో జరగనున్న ఫైనల్ పోరుకు అర్హత సాధించింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్..

అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఒక దశలో 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ప్రోటీస్ జట్టును మార్కో యాన్సన్ (55 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. కివీస్ బౌలర్లలో కోల్ మెక్కాన్చీ, రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ రెండేసి వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశారు.

దుమ్మురేపిన కివీస్ ఓపెనర్లు..

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇస్తూ హాఫ్ సెంచరీలు చేశారు. పవర్‌ప్లేలోనే 84 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో వరల్డ్ కప్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేశాడు. ఇక మరో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు చేసిన అవుటయ్యాడు. అనంతరం వచ్చిన రచిన్ రవీంద్ర 13 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సౌతాఫ్రికా బౌలర్లలో కగీసో రబాడ ఒక వికెట్ పడగొట్టాడు.

Next Story