Syed Modi International : ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీకాంత్.. టైటిల్ నిరీక్షణకు తెరదించుతాడా?

by Harish |

సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు.

Syed Modi International : ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీకాంత్.. టైటిల్ నిరీక్షణకు తెరదించుతాడా?
X

దిశ, స్పోర్ట్స్ : లక్నోలో జరుగుతున్న సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. టోర్నీలో జోరు మీద ఉన్న అతను ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీస్‌లో శ్రీకాంత్ 21-15, 19-21, 21-13 తేడాతో మరో భారత ఆటగాడు మంజునాథ్‌పై గెలిచాడు. యువ షట్లర్ నుంచి శ్రీకాంత్ గట్టిపోటీనే ఎదుర్కొన్నాడు. 59 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో మూడో గేములో శ్రీకాంత్‌ను విజయం వరించింది. శ్రీకాంత్ టైటిల్ నెగ్గి చాలా ఏళ్లు అవుతుంది. 2017లో చివరిసారిగా టైటిల్ గెలిచాడు. ఈ ఏడాది మలేసియా మాస్టర్స్‌ టోర్నీలో ఫైనల్‌కు వెళ్లినా నిరాశ తప్పలేదు. మరి శ్రీకాంత్ టైటిల్ నిరీక్షణకు తెరదించుతాడా?లేదా? చూడాలి. ఫైనల్‌లో హాంకాంగ్ ప్లేయర్ జాసన్ గునావన్‌తో తలపడనున్నాడు.

మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ కూడా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో 21-11, 21-15 తేడాతో మలేసియాకు చెందిన ఓంగ్ జిన్ యి-కార్మెన్ టింగ్ జంటను ఓడించింది. గతేడాది విజేతగా నిలిచిన గాయత్రి-ట్రీసా జోడీ ఈ సారి కూడా టైటిల్ కాపాడుకోవాలని చూస్తోంది. ఉమెన్స్ సింగిల్స్‌లో భారత యువ షట్లర్లు తన్వి శర్మ, ఉన్నతి హుడా లకు నిరాశ తప్పలేదు. సెమీస్‌లో హుడా 15-21, 10-21 తేడాతో తుర్కియేకు చెందిన నెస్లిహాన్ ఆరిన్‌ చేతిలో ఓడిపోయింది. టోర్నీలో సంచలన ప్రదర్శన చేసిన తన్వి కూడా టోర్నీ నుంచి నిష్ర్కమించింది. జపాన్‌ క్రీడాకారిణి అకెచి చేతిలో 21-17, 21-16 తేడాతో పరాజయం పాలైంది.


Next Story