వరుసగా విఫలమవుతున్న సూర్య.. ఆసిస్ గడ్డపైనా పుంజుకుంటాడా?

by Harish |

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ ఇటీవల కాలంలో వరుసగా విఫలమవుతున్నాడు.

వరుసగా విఫలమవుతున్న సూర్య.. ఆసిస్ గడ్డపైనా పుంజుకుంటాడా?
X

దిశ, స్పోర్ట్స్ : సూర్యకుమార్ యాదవ్.. క్రీజులో ఉంటే బౌలర్ల ఊచకోతే.. స్టేడియం బౌండరీల మోతతో మోగిపోవాల్సిందే. తొలి బంతి నుంచే పరుగుల వరద పారాల్సిందే.. స్టేడియమంతంటూ బంతిని తరలించే సూర్య 360 ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. కానీ, ఇటీవల కాలంలో సూర్య మెరుపులు కనిపించడం లేదు. బౌలర్లను బెంబేలెత్తించే అతని ఆటతీరు అభిమానులు మిస్ అవుతున్నారు. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న అతను వరుసగా విఫలమవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అతని ఫామ్ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇటీవల ఆసియా కప్‌లో కూడా విఫలమయ్యాడు. టీ20 వరల్డ్ కప్-2026‌కు ఎంతో సమయం లేదు. మరో మూడు నెలలే ఉంది. అంతకుముందే అతను ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ అతనికి చక్కటి అవకాశం. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రేపు తొలి మ్యాచ్ జరగనుంది.

కెప్టెన్‌గా హిట్

భారత టీ20 కెప్టెన్‌గా సూర్య జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత సూర్య టీ20 పగ్గాలు చేపట్టాడు.ఇప్పటివరకు అతని సారథ్యంలో భారత జట్టు సిరీస్ కోల్పోలేదు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌లపై టీమిండియా సిరీస్ విజయాలు సాధించింది. ఇటీవల అతని నాయకత్వంలో ఆసియా కప్‌ కూడా గెలిచింది. అతని కెప్టెన్సీలో భారత్ 29 మ్యాచ్‌లు ఆడగా 25 విజయాలు నమోదు చేయడం విశేషం. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే ఓడింది. కెప్టెన్‌గా అతనికి వంక పెట్టడానికి లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లోనూ భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నాడు.

ప్లేయర్‌గా ఫట్

సారథిగా ఆకట్టుకుంటున్నా ప్లేయర్‌గా మాత్రం సూర్య విఫలమవుతున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అతని ప్రదర్శన ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదు. ఒకప్పుడు క్రీజులోకి వస్తేనే దూకుడు మొదలుపెట్టే అతను ఇప్పుడు తీవ్రంగా తడబడుతున్నాడు. క్రీజులో కూడా నిలువలేకపోతున్నాడు. గతేడాది అక్టోబర్‌లో అతను చివరి హాఫ్ సెంచరీ చేశాడు. శతకం 2023 డిసెంబర్‌లో సౌతాఫ్రికాపై కొట్టాడు. చివరి 14 ఇన్నింగ్స్‌ల్లో అతని అత్యధిక స్కోరు 47. మూడు సార్లు డకౌటయ్యాడు. 6సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఇటీవల ఆసియా కప్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 72 పరుగులే చేశాడు. సూర్య వైఫల్యానికి కెప్టెన్సీ ఒత్తిడే కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని కాదనలేం కూడా. అతని ఇన్నింగ్స్‌లను పరిశీలిస్తే కెప్టెన్ అయ్యాకే అతని ప్రదర్శన తగ్గిందనే విషయం అర్థమవుతుంది. వరుసగా నిరాపరుస్తూ జట్టుకు భారంగా మారాడు. ఇప్పటికే టెస్టు, వన్డే పగ్గాలు అందుకున్న గిల్ భవిష్యత్తులో టీ20 జట్టు బాధ్యతలను కూడా అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. కాబట్టి, సూర్య కెప్టెన్‌గా నిరూపించుకున్నప్పటికీ ప్లేయర్‌గా తిరిగి సత్తాచాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సూర్య ఫామ్‌పై ఆందోళన లేదు : గంభీర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. సూర్యను వెనకేసుకొచ్చాడు. సూర్య ఫామ్‌పై తనకు ఎలాంటి ఆందోళన లేదన్నాడు. తాజాగా జియో స్టార్‌తో గంభీర్.. సూర్య గురించి మాట్లాడాడు. ‘నిజాయితీగా చెబుతున్నా సూర్య బ్యాటింగ్ ఫామ్‌‌పై నేను ఆందోళన పడటం లేదు. ఎందుకుంటే మేము అల్ట్రా దూకుడుగా ఆడాలనుకుంటున్నాం. అలా ఆడుతున్నప్పుడు వైఫల్యాలు అనివార్యం. సూర్య 30 బంతుల్లో 40 రన్స్ సులభంగా చేయగలడు. అప్పుడు విమర్శల నుంచి తప్పించుకోవచ్చు. కానీ, మేము దూకుడు విధానాన్ని అనుసరిస్తున్నప్పుడు వైఫల్యాలు ఆమోదయోగ్యమేనని మేము నిర్ణయించుకున్నాం. సూర్య తన లయను అందుకున్నప్పుడు బాధ్యతను మోస్తాడు.’అని గంభీర్ తెలిపాడు. అయినా టీ20 క్రికెట్‌లో తమ ఫోకస్ వ్యక్తగత పరుగులపై మీద కాకుండా తమ బ్రాండ్ క్రికెట్‌పై ఉంటుందన్నాడు.

Next Story