- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 కెరీర్‌లో కీలక మైలురాయిని చేరుకున్న సూర్య.. రోహిత్ తర్వాత అతనే
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో వరుణుడు బోణీ కొట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో వరుణుడు బోణీ కొట్టాడు. కాన్‌బెర్రాలో బుధవారం జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణమైంది. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది. కేవలం 9.4 ఓవర్ల మాత్రమే సాగగా.. వరుణడు అడ్డు తగలడంతో ఫలితం తేలలేదు. టాస్ గెలిచిన ఆసిస్ బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఆట ప్రారంభమైన కాసేపటికే వర్షం అంతరాయం కలిగించింది. కొద్దిసేపటి తర్వాత వాన తగ్గడంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించి తిరిగి ప్రారంభించారు. ఆ తర్వాత కూడా వర్షం కరుణించలేదు. మరికాసేపట్లో మళ్లీ వచ్చింది. అప్పటి వరకు 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాగగా భారత్ 97/1 స్కోరు చేసింది. ఈ సారి వాన తగ్గే అవకాశాలు కన్పించకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో తొలి మ్యాచ్ వరుణుడి ఖాతాలోకి వెళ్లింది. శుక్రవారం రెండో టీ20 జరగనుంది.
రోహిత్ తర్వాత సూర్యనే
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఇటీవల కాలంలో భీకర ఫామ్‌లో ఉన్న యువ సంచలనం అభిషేక్ శర్మ(19) దూకుడుగా ఆడే క్రమంలో త్వరగానే వికెట్ పారేసుకున్నాడు. అనంతరం మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(37 నాటౌట్), కెప్టెన్ సూర్యకుమార్(39 నాటౌట్) చెలరేగి ఆడారు. వన్డే సిరీస్‌లో తడబడిన గిల్, కొంతకాలంగా ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న సూర్య.. ఈ మ్యాచ్‌లో ఆసిస్ బౌలర్లను ఏ మాత్రం లెక్కచేయలేదు. ఒకవైపు వర్షం అంతరాయం కలిగించగా.. వీలైనన్నీ ఎక్కువ పరుగులు రాబట్టేందుకు బౌండరీలతో రెచ్చిపోయారు. 10వ ఓవర్‌లో సూర్య వరుసగా 4, 4, 6 దంచాడు. ఆ ఓవర్‌లోనే వాన పడటంతో ఆట నిలిచిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో 2 సిక్సర్లు కొట్టిన సూర్య ఓ కీలక మైలురాయిని అందుకున్నాడు. ఆ సిక్సర్లతో టీ20ల్లో 150 సిక్స్‌లు పూర్తి చేశాడు. రోహిత్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ సూర్య. టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్ల జాబితాలో రోహిత్(205) అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్యది 5వ స్థానం.






