టీ20 ముంబై లీగ్‌లో స్టార్ క్రికెటర్లు.. ఎవరెవరు ఆడుతున్నారో తెలుసా?

by Harish |

ఆరేళ్ల తర్వాత టీ20 ముంబై లీగ్ ఈ ఏడాది జరగనుంది.

టీ20 ముంబై లీగ్‌లో స్టార్ క్రికెటర్లు.. ఎవరెవరు ఆడుతున్నారో తెలుసా?
X

దిశ, స్పోర్ట్స్ : ఆరేళ్ల తర్వాత టీ20 ముంబై లీగ్ ఈ ఏడాది జరగనుంది. మే 26 నుంచి జూన్ 8 వరకు టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, ఈ టోర్నీలో టీమిండియా స్టార్లు పాల్గొనబోతున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) మంగళవారం వెల్లడించింది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానె‌తోపాటు సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, పృథ్వీ షా, శివమ్ దూబె, తుషార్ దేశ్‌పాండే టీ20 ముంబై లీగ్‌లో ఆడబోతున్నారు. ముంబైకి చెందిన ఈ 8 మంది ప్లేయర్లు భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు. ‘దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ముంబై గౌరవాన్ని పెంచిన ఈ ఎనిమిది మంది ప్లేయర్లు టీ20 ముంబై లీగ్‌లో ఆడుతున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాం. వారు ముంబై ఆత్మ, వారసత్వం, శ్రేష్టతను సూచిస్తారు. ఈ ఎనిమిది మంది ఆటగాళ్లు పాల్గొనడం ద్వారా టోర్నీ స్థాయి కూడా పెరుగుతుంది.’అని ఎంసీఏ ప్రెసిడెంట్ అజింక్యా నాయక్ తెలిపారు. సూర్య, అయ్యర్, రహానె, శార్దూల్ పాల్గొంటుండటంతో టీ20 ముంబై లీగ్‌కు స్టార్ కల రానుంది. వీరికి వేలం మొత్తానికి అదనంగా ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఎంసీఏ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. లీగ్‌లోని ప్రతి ఫ్రాంచైజీకి ఒక స్టార్ ప్లేయర్ ప్రాతినిధ్యం వహించేందుకు అనుమతి ఉంది. త్వరలోనే ప్లేయర్ల వేలంను ఎంసీఏ నిర్వహించనుంది. 2,800 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.


Next Story