పాక్ ప్లేయర్‌ను కొంటే భారతీయుల ప్రాణాలకే ముప్పు : సునీల్ గవాస్కర్

by Harish |

పాక్ ప్లేయర్‌ను కొంటే భారతీయుల ప్రాణాలకే ముప్పు : సునీల్ గవాస్కర్
X

దిశ, స్పోర్ట్స్ : ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాక్ స్పిన్నర్ అబ్రార్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ రూ.2.34 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. భారత్‌కు చెందిన సన్ గ్రూపు పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ క్రికెటర్లకు ఫీజు చెల్లించడమంటే భారత సైనికులు, పౌరుల మరణానికి దోహదపడ్డేనని వ్యాఖ్యానించాడు. ‘2008 నవంబర్‌లో ముంబై ఎటాక్స్ తర్వాత భారత ఫ్రాంచైజీ ఓనర్లు ఐపీఎల్ నుంచి పాక్ ప్లేయర్లను పక్కనపెట్టారు. ది హండ్రెడ్ లీగ్‌లో భారత ఓనర్ పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడం అలజడిని సృష్టించింది. ఫీజు రూపంలో వచ్చిన మొత్తానికి పాక్ ప్లేయర్ తన ప్రభుత్వానికి ఇన్‌కం ట్యాక్స్ కడతాడు. దీంతో పాక్ ప్రభుత్వం ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. అంటే పరోక్షంగా భారత సైనికులు, పౌరుల ప్రాణాలు పోవడానికి దోహదపడుతుంది. భారత సంస్థ అయినా విదేశీ అనుబంధ సంస్థ అయినా యజమాని భారతీయుడు అయితే భారతీయుల ప్రాణాలు పోవడానికి సహకరిస్తున్నట్టే. సన్‌రైజర్స్ లీడ్స్ కోచ్, న్యూజిలాండ్‌కు చెందిన డేనియల్ వెట్టోరికి ఇది అర్థంకాకపోవచ్చు. కానీ, భారత యాజమాన్యం ఇది అర్థం చేసుకోవాలి. భారతీయుల జీవితాల కంటే టోర్నీ గెలవడం ముఖ్యమా?’అని గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే, ఈ ప్రభావం కచ్చితంగా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఉంటుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. భారత అభిమానులు నిరసన తెలిపితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చని తెలిపాడు. తప్పును సరిదిద్దుకోవడానికి కావ్యా మారన్‌కు సమయం ఉందని చెప్పాడు.


Next Story