- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోమకొండ బాయ్స్.. బాణం ఎక్కుపెడితే గురి పక్కా!
దోమకొండ గడి కోట చరిత్ర తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఆ దోమకొండ గడి కోట ఆర్చరీ క్రీడా శిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

దిశ, భిక్కనూరు : దోమకొండ గడి కోట చరిత్ర తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఆ దోమకొండ గడి కోట ఆర్చరీ క్రీడా శిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దోమకొండ బాయ్స్ బాణాలు ఎక్కుపెట్టారంటే పక్కాగా పతకాలు దక్కాల్సిందే. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారంతా.. పట్టుదలతో ఆర్చరీలో ఆరి తేరుతున్నారు. గురువు చెప్పిన మెలకువలను చక్కగా పాటిస్తూ తర్ఫీదు పొందుతున్నారు. చిన్నవయసులోనే రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొని పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు.
గడికోట వారసుడి కల
దోమకొండ గడికోట వారసుడు అనిల్ కామినేని స్వతహాగా ఆర్చరీ క్రీడాకారుడు. మన రాష్ట్రం నుంచి ఆర్చరీ క్రీడాకారులను తయారు చేయాలనే సంకల్పంతో దోమకొండ గడికోటలో ఆర్చరీ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఈ అకాడమీలో శిక్షణ ఇచ్చేందుకు తన సహచర క్రీడాకారుడైన కలకత్తా( వెస్ట్ బెంగాల్) నగరానికి చెందిన ప్రతాప్ దాస్ ను ప్రధాన కోచ్ గా నియమించారు. గడి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అకాడమీకి అనిల్ కామినేని పూర్తి సహాయసహకారాలను అందిస్తున్నారు. అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులకు కావాల్సిన విల్లులు(bow), ఇతర ఆర్చరీ క్రీడా సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నారు. ఇండియన్ బౌ వేల రూపాయల్లో ఉండగా, రికర్వ్ బౌ లక్షల్లో ధర ఉంటుందని క్రీడాకారులు తెలిపారు.
రోజుకు 4 గంటల శిక్షణ
దోమకొండలోని గడికోటలో గల ఆర్చరీ అకాడమీలో కోచ్ ప్రతాప్ దాస్ ఉదయం 2గంటలు, సాయంత్రం 2గంటల చొప్పున ప్రతి రోజూ 4 గంటల పాటు క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. నిత్యం కఠోర సాధన చేయిస్తుండడంతో గడి కోటలో శిక్షణ పొందుతున్న చాలామంది ఆర్చరీ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధిస్తున్నారు. దోమకొండ గ్రామానికి చెందిన కదిరె సింధూజ అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించగా, శ్రీధర్, నిఖిత, భవానీ, అనుదీప్, ఇందు, నవీన్, ప్రీతి, అకుల్ జాతీయస్థాయిలో రాణిస్తూ గడికోటకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారు. ఆర్చరీలో చక్కగా రాణిస్తుండడంతో తల్లిదండ్రులు కూడా వారిని క్రమంతప్పకుండా శిక్షణకు పంపి ప్రోత్సహిస్తున్నారు.






