ఐపీఎల్‌లో ఆటగాళ్ల‌పై కఠిన ఆంక్షలు.. బీసీసీఐ ‘హనీ ట్రాప్’ వార్నింగ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-08 03:30:21  IST  )

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆటగాళ్లను హనీ ట్రాప్ నుంచి కాపాడేందుకు బీసీసీఐ కఠిన నిబంధనలు తీసుకొచ్చింది

ఐపీఎల్‌లో ఆటగాళ్ల‌పై కఠిన ఆంక్షలు.. బీసీసీఐ ‘హనీ ట్రాప్’ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో పాల్గొంటున్న ఆటగాళ్లకు బీసీసీఐ (BCCI) కార్యదర్శి దేవాజిత్ సైకియా (Devajit Saikia) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఏడు పేజీల సుదీర్ఘ నిబంధనల పత్రాన్ని అన్ని ఫ్రాంచైజీలకు పంపిస్తూ, ఆటగాళ్ల ప్రవర్తన, భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. బీసీసీఐ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, ఐపీఎల్ ఆపరేషన్స్ బృందాలు ఎప్పుడైనా ఆటగాళ్ల హోటల్ గదులను తనిఖీ చేయవచ్చని పేర్కొన్నారు. టీమ్ మేనేజర్ నుంచి ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ తమ గదుల్లోకి బయటి వ్యక్తులను తీసుకెళ్లకూడదని తెలిపారు. అతిథులతో సమావేశం కావాలంటే హోటల్ లాబీ లేని పక్షంలో లాంజ్‌లలో మాత్రమే కలవాలన్నారు.

అదేవిధంగా ఆటగాళ్లు వ్యక్తిగత పనుల మీద హోటల్ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే, ఖచ్చితంగా సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ (SLO), టీమ్ ఇంటిగ్రిటీ ఆఫీసర్ (TIO) వద్ద క్లియరెన్స్ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే భారీ నగదు జరిమానా విధించడమే కాకుండా, ప్రస్తుత సీజన్ నుంచి సస్పెండ్ చేయడం, భవిష్యత్తు ఐపీఎల్ సీజన్ల నుంచి టర్మినేట్ చేస్తామని హెచ్చిరించారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫ్రాంచైజీ యజమానులు, సీనియర్ మేనేజ్‌మెంట్ సభ్యులు డగౌట్‌లోని ఆటగాళ్లతో, మేనేజర్లతో మాట్లాడకూడదని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు.

అయితే, ఇంటర్నేషన్ మ్యాచ్‌లలో ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేయడం, హనీ ట్రాప్ చేయడం వంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. లీగ్ కీలక దశకు చేరుకుంటున్న సమయంలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతినకుండా, చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా చూడటమే బీసీసీఐ ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది.

Next Story