జ్యోతికి గాయం.. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆశలపై ఎఫెక్ట్

by Harish |

తెలుగమ్మాయి, భారత స్టార్ అథ్లెట్ యర్రాజి జ్యోతి గాయపడింది.

జ్యోతికి గాయం.. వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆశలపై ఎఫెక్ట్
X

దిశ, స్పోర్ట్స్ : తెలుగమ్మాయి, భారత స్టార్ అథ్లెట్ యర్రాజి జ్యోతి గాయపడింది. ఇటీవల ట్రైనింగ్ సెషన్‌లో ఆమె మోకాలికి గాయమైంది. ఈ విషయాన్ని జ్యోతి బుధవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ‘కొన్ని రోజుల క్రితం ట్రైనింగ్‌లో నా మోకాలికి గాయమైంది. దీంతో నా సీజన్‌కు విరామం ఇస్తున్నా. మెడికల్ టీమ్‌తో కలిసి పనిచేస్తున్నా. అథ్లెట్ల ప్రయాణంలో గాయాలు ఓ భాగం. దీనిని మరో అడ్డంకిగా మాత్రమే చూస్తున్నా. మీ అందరి మద్దతు, ఆశీర్వాదంతో దీనిని అధిగమిస్తాను. త్వరలోనే బలంగా తిరిగి వస్తా.’అని జ్యోతి పేర్కొంది. జ్యోతికి అయిన గాయం తీవ్రమైనదని ఆమె కోచ్ జేమ్స్ హిల్లియర్ తెలిపారు. ఏసియన్ చాంపియన్ అయిన జ్యోతి సెప్టెంబర్‌లో జరిగే వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా అయిన గాయం ఆమె ఆశలపై ఎఫెక్ట్ చూపనుంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌కు రెండు మార్గాల్లో అర్హత సాధించొచ్చు. క్వాలిఫికేషన్ మార్క్‌ను సాధించడం ద్వారా నేరుగా క్వాలిఫై కావొచ్చు. లేదంటే వరల్డ్ ర్యాంకింగ్స్(టాప్-16)ద్వారా అర్హత పొందొచ్చు. ఆగస్టు 24 వరకు క్వాలిఫికేషన్ విండో ఉంటుంది. ప్రస్తుతం 12వ ర్యాంక్‌లో ఉన్న జ్యోతి అప్పటివరకు ర్యాంక్‌ను కాపాడుకోవాల్సి ఉంది.


Next Story