హైదరాబాద్‌ను వదిలేయనున్న సన్‌రైజర్స్?

by Ajay Maddhiboyina |

హెచ్‌సీఏ లిఖిత పూర్వకంగా ఇస్తే.. ఆ లేఖను తెలంగాణ ప్రభుత్వం, బీసీసీఐకి చూపించి ఫిర్యాదు చేస్తామని శ్రీనాథ్ అన్నారు.

హైదరాబాద్‌ను వదిలేయనున్న సన్‌రైజర్స్?
X

- హెచ్‌సీఏతో ముదిరిన వివాదం

- ఫ్రీ టికెట్ల కోసం హెచ్‌సీఏ ప్రెసిడెంట్ ఒత్తిడి?

- లిఖిత పూర్వకంగా రాసిస్తే వెళ్లిపోతామన్న సన్‌రైజర్స్?

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించిన టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తమను బ్లాక్ మెయిల్ చేస్తోందని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరోపిస్తోంది. ఇలా బ్లాక్‌మెయిల్, బెదిరింపులకు పాల్పడితే తాము హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామని సన్‌రైజర్స్ పేర్కొన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో పేర్కొంది. హెచ్‌సీఏ టాప్ మేనేజ్‌మెంట్, ముఖ్యంగా ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు నుంచి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని, ఈ అన్‌ప్రొఫెషనల్ ధోరణిని అంగీకరించబోమని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజర్ శ్రీనాథ్ టీడీ ఒక ఈమెయిల్‌ను హెచ్‌సీఏ ట్రెజరర్ సీజే శ్రీనివాస్‌కు పంపినట్లు తెలిసింది. హెచ్‌సీఏతో తమకు 12 ఏళ్ల అనుబంధం ఉందని.. ఏనాడూ ఇలాంటి బెదిరింపులు రాలేదని.. కానీ 2024 నుంచి ఇలాంటి అన్‌ప్రొఫెషనల్ ధోరణి పెరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు. మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక వీఐపీ బ్లాక్‌ను లాక్ చేశారని.. ఆ మేరకు టీవీ టెలికాస్టింగ్‌లో కూడా చూడవచ్చని ఆ లేఖలో శ్రీనాథ్ తెలిపారు.

సన్‌రైజర్స్ యాజమాన్యం హైదరాబాద్‌లో మ్యాచ్‌లకు వివిధ వాటాదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ప్రతీ ఆటకు 3,900 టికెట్లు కాంప్లిమెంటరీ కింద అందిస్తున్నామని అన్నారు. వీటిలో 50 వీఐపీ బాక్సు టికెట్లు హెచ్‌సీఏకే కేటాయించినట్లు తెలిపారు. అయితే 50 టికెట్లు సరిపోవని.. అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని హెచ్‌సీఏ డిమాండ్ చేసినట్లు శ్రీనాథ్ తెలిపారు. తాము ఆ అభ్యర్థనను తిరస్కరించామన్న కారణంతో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక బాక్స్‌ను లాక్ చేసి ఎవరికీ ఎంట్రీని ఇవ్వలేదని అన్నారు. చాలా ఏళ్లుగా హెచ్‌సీఏకు 3,900 టికెట్లు ఇస్తున్నాము. ఇందులో ఎఫ్12ఏ బాక్స్‌ను వారికే ఇస్తున్నాము. అయితే దీని సామర్థ్యం కేవలం 30 మాత్రమే అని.. మరో 20 అదనంగా ఇవ్వాలంటూ హెచ్‌సీఏ డిమాండ్ చేస్తోందని సన్‌రైజర్స్ యాజమాన్య ఆరోపించింది. ఈ విషయంలో స్నేహపూర్వక పరిష్కారాన్ని చూసుకుందామని కూడా లేఖలో పేర్కొన్నారు.

అయితే ఉచిత టికెట్ల కోసం బ్లాక్ మెయిల్ చేయడం ఇదే తొలి సారి కాదని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజర్ ఆరోపించారు. ఈ బెదిరింపులు ఇలాగే కొనసాగితే వేరే వేదికకు మారడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. హెచ్‌సీఏ లిఖిత పూర్వకంగా ఇస్తే.. ఆ లేఖను తెలంగాణ ప్రభుత్వం, బీసీసీఐకి చూపించి ఫిర్యాదు చేస్తామని శ్రీనాథ్ అన్నారు.

Next Story