ఐఎస్‌ఎల్‌కు నిధులివ్వలేం.. లీగ్ నడిపే బాధ్యత మాది కాదు: ప్రభుత్వం

by Phanindra |

ఐఎస్‌ఎల్‌ నిర్వహణకు కేంద్రం నుంచి నిధులివ్వలేమని, లీగ్ నడిపే బాధ్యత తమది కాదని క్రీడాశాఖ స్పష్టంచేసింది.

ఐఎస్‌ఎల్‌కు నిధులివ్వలేం.. లీగ్ నడిపే బాధ్యత మాది కాదు: ప్రభుత్వం
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)ను కాపాడేందుకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందనే వార్తల్లో ఏమాత్రం నిజంలేదని క్రీడాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ (ఏఐఎఫ్ఎఫ్)తోపాటు క్లబ్ ఓనర్లను ఆదుకునేందుకు.. ఐఎస్ఎల్ కోసం కేంద్ర క్రీడాశాఖ కొంత నిధులు సమకూరుస్తుందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు ఈ స్పష్టతనిచ్చాయి. అయితే ఐఎస్ఎల్, సెకండ్ టైర్ ఐ-లీగ్ రెండూ ఈ సీజన్లో జరుగుతాయని వెల్లడించిన క్రీడాశాఖ.. దానికోసం ప్రభుత్వ నిధులను కేటాయించడం జరగదని తేల్చిచెప్పింది. ‘నిధులు, లీగ్ నిర్వహణలో క్రీడాశాఖ ఎలాంటి సాయం చేయలేదు. ఇదంతా లీగ్‌ యాజమాన్యమే చూసుకోవాలి’ అని క్రీడాశాఖ స్పష్టంచేసింది.

లీగ్ కోసం కొత్త స్పాన్సర్‌షిప్ డీల్ లభించే వరకు.. ఫ్రాంచైజీలే లీగ్ కోసం నిధులు సమకూర్చాలని ప్రభుత్వ సలహా ఇచ్చింది. ఇలా చేస్తే సాధ్యమైనంత త్వరగా లీగ్ ప్రారంభించొచ్చని, ఈలోపు కొత్త స్పాన్సర్ లభించినా లేక ఫుట్‌బాల్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్‌డీఎల్)తో ఒప్పందం కుదిరినా స్పాన్సర్ రెవెన్యూ అడ్జస్ట్ చేసుకోవచ్చని సూచించింది. అలాగే తక్కువ సిటీల్లో లీగ్ నిర్వహించడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవచ్చని సలహా ఇచ్చింది. కాగా, సాధారణంగా సెప్టెంబరు నెలలో జరగాల్సిన ఐఎస్ఎల్.. ఈసారి ఆపరేషనల్ సమస్యల కారణంగా ఇప్పటి వరకు జరగలేదు.

Next Story