1998 తర్వాత సఫారీలకు తొలి ఐసీసీ టైటిల్.. 15 ఏళ్ల తర్వాత ఫైనల్ ఓడిన ఆసీస్

by Phanindra |

1998 తర్వాత సఫారీలు తొలి ఐసీసీ టైటిల్ నెగ్గింది. ఈ క్రమంలో 15 ఏళ్ల తర్వాత ఫైనల్‌లో ఆసీస్‌కు హార్ట్ బ్రేక్ మిగిలింది.

1998 తర్వాత సఫారీలకు తొలి ఐసీసీ టైటిల్.. 15 ఏళ్ల తర్వాత ఫైనల్ ఓడిన ఆసీస్
X

దిశ, స్పోర్ట్స్: ఫైనల్స్, సెమీస్‌కు చేరుకుంటే ఓడిపోవడం వాళ్లకు అలవాటు. కనీసం దేవుడు కూడా వారిపై కనికరించడు. తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో ఓడిపోవడం ఆ టీంకు పరిపాటే. అంతర్జాతీయ క్రికెట్లో నిజమైన ‘చోకర్స్’.. ఇవీ సౌతాఫ్రికాపై ఇంతకాలం ఉన్న ముద్రలు. గతేడాది టీ20 ఫైనల్‌లో కూడా గెలిచేలా కనిపించినా చివరకు ఓడిపోవడంతో ఈ వెటకారాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేరగానే.. టైటిల్ ఆసీస్‌దే అని అందరూ జోస్యం చెప్పేశారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్సులో సౌతాఫ్రికా బ్యాటర్లు కుదేలవడం చూసి ‘సౌతాఫ్రికా కదా.. ఇంతే’ అని సరిపెట్టుకున్నారు. ఆ టీం ఫ్యాన్స్ అంతా మరో హార్ట్‌బ్రేక్‌కు రెడీ అయ్యారు. కానీ వాళ్ల అంచనాలను ఈ జట్టు తారుమారు చేసేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 1998 తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ను ఖాతాలో వేసుకోవడంతోపాటు.. ఐసీసీ ఫైనల్స్‌లో ఓటమెరుగని ఆసీస్‌కు 15 ఏళ్ల తర్వాత హార్ట్‌బ్రేక్ మిగిల్చింది.

లార్డ్స్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సఫారీలు చెలరేగారు. అద్భుతమైన ఆటతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తుచేసి టైటిల్ గెలిచారు. తొలి ఇన్నింగ్సులో 138 పరుగులకే ఆలౌట్ అయిన సౌతాఫ్రికా టీం.. రెండో ఇన్నింగ్సులో 282 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసి సంచలనం సృష్టించింది. మరో ఐదు వికెట్లు మిగిలుండగానే నాలుగో రోజు తొలి సెషన్‌లోనే మ్యాచ్ నెగ్గింది. ఎయిడెన్ మార్క్రమ్ (136) అద్భుతమైన ఆటతీరుతో సౌతాఫ్రికాను విజయం వైపు నడిపించాడు. కెప్టెన్ టెంబా బవుమా (66) నాలుగో రోజు ఆట ఆరంభంలోనే వెనుతిరిగినా.. కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. 83.4 ఓవర్లలో 282/5 పరుగులు చేసిన సౌతాఫ్రికా సుమారు 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ నెగ్గడం గమనార్హం.

తొలి సెషన్‌లోనే ఖతం..

మార్క్రమ్, బవుమా మధ్య కీలక భాగస్వామ్యంతో 213/2 స్కోరు వద్ద మూడో రోజును సౌతాఫ్రికా ముగించింది. నాలుగో రోజు ఈ స్కోరుకు నాలుగు పరుగులు జోడించిన వెంటనే ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో బవుమా పెవిలియన్ చేరాడు. కాసేపు మార్క్రమ్‌కు జతగా నిలిచిన ట్రిస్టన్ స్టబ్స్ (8) కూడా పెద్దగా రాణించలేదు. ఇలాంటి సమయంలో డేవిడ్ బెడింగ్‌హాం (21 నాటౌట్)తో కలిసి మార్క్రమ్.. తన టీంను విజయం దిశగా తీసుకెళ్లాడు. విజయానికి ఆరు పరుగుల దూరంలో మార్క్రమ్ వెనుతిరిగినా.. వెరెన్నీ (4 నాటౌట్‌)తో కలిసి డేవిడ్ లాంఛనం ముగించాడు. అద్భుతంగా ఆడిన మార్క్రమ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో రాణించగా.. హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీసుకున్నారు.


15 ఏళ్ల తర్వాత తొలి ఓటమి..

ఐసీసీ ఈవెంట్లలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీం ఆస్ట్రేలియానే. ఇప్పటి వరకు 14 ఐసీసీ ఫైనల్స్ ఆడిన ఈ జట్టుకు ఇది కేవలం నాలుగో ఓటమి మాత్రమే. మొట్టమొదటిసారి 1975లో లార్డ్స్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో 17 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ చేతిలో ఓడిందీ జట్టు. ఆ తర్వాత 1996 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడింది. ఇక చివరగా 2010 టీ20 వరల్డ్‌ కప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత ఐసీసీ ఫైనల్ ఓడటం ఆసీస్‌కు ఇదే తొలిసారి.

Next Story