టీమిండియా మా ముందు మోకరిల్లాలి.. సఫారీ కోచ్ షాకింగ్ కామెంట్స్!

by Phanindra |

టీమిండియా మా ముందు మోకరిల్లేలా చేయాలని అనుకున్నాం అంటూ సఫారీ కోచ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

టీమిండియా మా ముందు మోకరిల్లాలి.. సఫారీ కోచ్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, స్పోర్ట్స్: నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత సఫారీ హెడ్ కోచ్ షుక్రి కొన్రాడ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారీ ఆధిక్యం సాధించిన తర్వాత కూడా డిక్లేర్ చేయకుండా, సుమారు 80 ఓవర్లు బ్యాటింగ్ చేయడం వెనకున్న కారణమేంటని ప్రశ్నించినప్పుడు టీమిండియాను అవమానించేలా సమాధానమిచ్చాడు. ‘టీమిండియా ప్లేయర్లను సాధ్యమైనంత సేపు మైదానంలో నిలబెట్టాలనుకున్నాం. వాళ్లు మా ముందు మోకరిల్లేలా చేయాలనుకున్నాం. బ్యాటుతోనే గెలవడం అసాధ్యమనేలా చేసి, అప్పుడు ఇంకో రోజు మా బౌలింగ్‌లో సర్‌వైవ్ అయ్యేందుకు ప్రయత్నించండని సవాల్ విసరడమే మా ఉద్దేశ్యం’ అని చెప్పాడు.

ఈ విషయం చెప్పేందుకు కొన్రాడ్ ‘గ్రావెల్’ (Grovel) అనే పదాన్ని వాడాడు. క్లైవ్ లాయిడ్ హయాంలో విండీస్‌తో సిరీస్ ముందు 1976లో ఇంగ్లండ్ కెప్టెన్ టోనీ గ్రెగ్ చేసిన జాత్యంహంకార వ్యాఖ్యల్లో ఈ పదం వాడాడు. నల్లజాతీయులు తమ ముందు మోకరిల్లేలా చేస్తామని టోనీ అన్నాడు. అయితే ఆ సిరీసులో ఇంగ్లండ్ 3-0తో వైట్ వాష్ అయింది. ఇప్పుడు ఆ పదాన్ని తను వాడుతున్నట్లు కొన్రాడ్ చెప్పాడు. అలాగే ఉదయం గేమ్‌ను ఇంకా కొత్తగా ఉన్న బంతితోనే ప్రారంభించాలని అనుకున్నామని, అంతేకాకుండా పిచ్‌పై నీడ పడినప్పుడు బౌలర్లకు కొంత సహకారం లభిస్తోందని, దాన్ని కూడా ఉపయోగించుకోవాలని అనుకున్నామని తమ ట్యాక్టిక్స్‌ను వివరించాడు.

ఈ సిరీసు ఇప్పటి వరకు ఎలాంటి గొడవలూ లేకుండా సాఫీగా సాగిపోయింది. తొలి టెస్టులో సఫారీ కెప్టెన్ బవుమాను బుమ్రా ‘బానా’ (పొట్టోడు) అంటూ కామెంట్ చేసినా.. బవుమా కానీ, ఆ టీం కానీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఆటతో సమాధానమిచ్చి ఆ మ్యాచ్ గెలిచారు. ఇప్పుడు కూడా పట్టుదలగా ఆడి విజయం ముంగిట నిలిచారు. ఇలాంటి సమయంలో కొన్రాడ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.

Next Story