ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం.. వైజాగ్ స్టేడియంలోని స్టాండ్‌లకు ఆ దిగ్గజ ప్లేయర్ల పేర్లు

by Harish |

దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్, మాజీ క్రికెటర్ రావి కల్పన‌లకు అరుదైన గౌరవం దక్కింది.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం.. వైజాగ్ స్టేడియంలోని స్టాండ్‌లకు ఆ దిగ్గజ ప్లేయర్ల పేర్లు
X

దిశ, స్పోర్ట్స్ : దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్, మాజీ క్రికెటర్ రావి కల్పన‌లకు అరుదైన గౌరవం దక్కింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలోని రెండు స్టాండ్‌లను మిథాలీ రాజ్, రావి కల్పనలకు అంకితం చేయనున్నట్టు ప్రకటించింది. మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 12న వైజాగ్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా మిథాలీ, కల్పనలను ఏసీఏ సత్కరించనుంది. వారి పేర్లతో రెండు స్టాండ్‌ల‌ను ఆవిష్కరించనున్నట్టు ఏసీఏ వెల్లడించింది. ‘మిథాలీ, కల్పన రాబోయే తరాలకు పెద్ద కలలు కనేందుకు స్ఫూర్తి. భారత్‌లో మహిళల క్రికెట్‌కు మార్గదర్శకులు. వారిని గౌరవించడం ఏసీసీ నిబద్ధతను ప్రతిబంబిస్తోంది.’అని ఏసీసీ తెలిపింది. మిథాలీ భారత మహిళా క్రికెట్‌కు ఐకాన్. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసింది. ఇక, ఆంధ్ర నుంచి వచ్చిన వికెట్ కీపర్ కల్పన అంతర్జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగింది.

స్మృతి మంధాన విజ్ఙప్తితో..

వైజాగ్ స్టేడియంలోని స్టాండ్‌లకు మిథాలీ, కల్పన పేరు పెట్టడంలో స్మృతి మంధాన చొరవ ఉంది. ఆగస్టులో వైజాగ్‌లో జరిగిన ‘బ్రేకింగ్ బౌండరీ’ కార్యక్రమంలో స్మృతి మంధాన పాల్గొంది. ఆ ఈవెంట్‌‌‌కు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంధాన మాట్లాడుతూ.. దేశంలోని స్టేడియాల్లో పురుష క్రికెటర్ల పేర్లతోనే స్టాండ్‌లు ఉన్నాయని, ఆ గౌరవం మహిళా క్రికెటర్లకు దక్కడం లేదని తెలిపింది. స్పందించిన మంత్రి లోకేశ్ ఏసీఏతో మాట్లాడారు. ఈ క్రమంలోనే మిథాలీ, కల్పన పేర్లను స్టాండ్‌లకు పెట్టాలని ఏసీఏ నిర్ణయం తీసుకుంది.


Next Story