ODI Tri-Nation Series : అదరగొట్టిన అమ్మాయిలు.. భారత్ చేతిలో శ్రీలంక చిత్తు

by Harish |

శ్రీలంక, సౌతాఫ్రికాలతో ఆదివారం ప్రారంభమైన ట్రై సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు బోణీ కొట్టింది.

ODI Tri-Nation Series : అదరగొట్టిన అమ్మాయిలు.. భారత్ చేతిలో శ్రీలంక చిత్తు
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక, సౌతాఫ్రికాలతో ఆదివారం ప్రారంభమైన ట్రై సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు బోణీ కొట్టింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ 9 వికెట్ల విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో రెండు ఇన్నింగ్స్‌లను 39 ఓవర్లకు కుదించి ఆట నిర్వహించారు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు 38.1 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థి బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. తెలుగమ్మాయి చరణి(2/26), స్నేహ్ రాణా(3/31), దీప్తి శర్మ (2/22) స్పిన్ మాయకు శ్రీలంక చేతులెత్తేసింది. ఆ జట్టులో హాసిని పెరీరా(30) టాప్ స్కోరర్. కెప్టెన్ ఆటపట్టు(7), హర్షిత మాధవి(14), హన్సిమ కరుణరత్నే(4), కావిశా దిల్హారి(25), నీలక్షి డి సిల్వ(10), అనుష్క సంజీవణి(22) నిరాశపరిచారు.

ఇక, 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. 29.4 ఓవర్లలో ఒక్క వికెటే కోల్పోయి 149 రన్స్ చేసింది. ఓపెనర్ ప్రాతిక రావల్(50 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది. స్మృతి మంధాన(43), హర్లీన్ డియోల్(48 నాటౌట్) కూడా రాణించడంతో భారత్‌కు భారీ విజయం దక్కింది.


Next Story