రెచ్చిపోయిన స్మృతి, స్నేహ్ రాణా.. ట్రై సిరీస్ భారత్‌దే

by Harish |

సౌతాఫ్రికా, శ్రీలంకలతో జరిగిన ట్రై సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది.

రెచ్చిపోయిన స్మృతి, స్నేహ్ రాణా.. ట్రై సిరీస్ భారత్‌దే
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. అదిరే ప్రదర్శనతో సౌతాఫ్రికా, శ్రీలంకలతో జరిగిన ట్రై సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్‌లో శ్రీలంకను మట్టికరిపించి విజేతగా నిలిచింది. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం నమోదు చేసింది. టోర్నీలో భారత జట్టు ఆద్యంతం అద్భుత ప్రదర్శన చేసింది. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయం సాధించింది. ఫైనల్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ముందుగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక, భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక తేలిపోయింది. భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన ప్రత్యర్థి 48.2 ఓవర్లలో 245 పరుగులకే కుప్పకూలింది. సెంచరీతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ట్రై సిరీస్‌లో అత్యధిక వికెట్లు(16) తీసిన భారత స్పిన్నర్ స్నేహ రాణా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది.

సెంచరీతో కదం తొక్కిన స్మృతి మంధాన

ఫైనల్‌లో స్మృతి మంధాన రెచ్చిపోయింది. లంక బౌలర్లకు చుక్కలు చూపించింది. ఓపెనర్‌గా వచ్చిన స్మృతి 32 ఓవర్లపాటు క్రీజులో ఉంది. ఎడాపెడా ఫోర్లు దంచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఆమె సెంచరీతో కదం తొక్కి భారత్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. 101 బంతుల్లో 116 స్కోరు చేసింది. ఆమె ఇన్నింగ్స్ 15 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. వన్డేల్లో ఆమెకు ఇది 11వ శతకం. మిగతా బ్యాటర్లు కూడా స్మృతి జోరును కొనసాగించారు. హర్లీన్ డియోల్(47), రోడ్రిగ్స్(44), హర్మన్‌ప్రీత్(41) కూడా సత్తాచాటారు. దీంతో పరుగుల వరద పారించిన భారత్ 50 ఓవర్లలో 342 పరుగులు చేసింది.

స్నేహ్ రాణా, అమన్‌జోత్ ధాటికి లంక విలవిల

భారత్ విజయంలో బౌలర్లు తమ పాత్ర నిర్వర్తించారు. ముఖ్యంగా స్నేహ్ రాణా, అమన్‌జోత్ కౌర్ బంతితో విజృంభించారు. స్నేహ్ రాణా 4 వికెట్లు, అమన్‌జోత్ 3 వికెట్లతో సత్తాచాటారు. వారి ధాటికి శ్రీలంక జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ ఆటపట్టు(51), నీలాక్షి డి సిల్వ(48) మాత్రమే పోరాడగా.. మిగతా వారు విఫలమయ్యారు. తొలి బంతికే హాసిని పెరీరా(0)ను అమన్‌జోత్ అవుట్ చేసి శ్రీలంకకు ఆరంభంలోనే భారీ షాకిచ్చింది. విష్మి గుణరత్నే(36)ను అవుట్ చేసి రెండో వికెట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత స్నేహ్ రాణా లంక బ్యాటర్ల భరతం పట్టింది. క్రీజులో పాతుకపోయిన ఆటపట్టు, నీలాక్షి‌లను పెవిలియన్ పంపి ప్రత్యర్థి ఆశలపై నీళ్లుచల్లింది. వారు అవుటైన తర్వాత లంక జట్టు కోలుకోలేకపోయింది. ఇక, వరుస ఓవర్లలో మల్కి మదార(0), అనుష్క(28)లను స్నేహ్ రాణా అవుట్ చేసి శ్రీలంక కథ ముగించింది.

Next Story