- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిరాజ్ సిక్సర్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం
రెండో టెస్టులో మూడో రోజు కూడా చివరికి భారత్‌దే పైచేయి.

దిశ, స్పోర్ట్స్ : రెండో టెస్టులో మూడో రోజు కూడా చివరికి భారత్‌దే పైచేయి. తొలి ఇన్నింగ్స్ 180 పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టు బిగించే స్థితిలో నిలిచింది. బ్రూక్, స్మిత్ భారీ శతకాలతో ఆందోళన పెంచినా మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌కు కళ్లెం వేశాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బస్టన్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో శుక్రవారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు చేసింది. జేమీ స్మిత్(184 నాటౌట్), హ్యారీ బ్రూక్(158) భారీ శతకాలతో కదం తొక్కి జట్టును ఆదుకున్నారు. లేదంటే ఇంగ్లాండ్ పరిస్థితి మరోలా ఉండేది. సిరాజ్(6/70),ఆకాశ్ దీప్(4/88) విజృంభించి ఇంగ్లాండ్‌ను కట్టడి చేశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 587 స్కోరు చేసిన విషయం తెలిసిందే. మూడో రోజు చివరి సెషన్‌లో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ ఒక్క వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది. జైశ్వాల్(28) ధాటిగా ఆడే క్రమంలో త్వరగానే అవుటవ్వగా.. కేఎల్ రాహుల్(28), కరున్ నాయర్(7) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. శనివారం టీమిండియా బ్యాటర్లు మరోసారి చెలరేగి ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం పెట్టాల్సిన అవసరం ఉంది.
బ్రూక్, స్మిత్ భారీ శతకాలు
ఇంగ్లాండ్ కౌంటర్ ఎటాక్ ఇచ్చిందంటే హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్‌లే కారణం. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో మిగతా వారెవరు రాణించలేదు. 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఆ జట్టు 200 కూడా చేస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ, బ్రూక్, స్మిత్ మాత్రం పోరాట పటిమ కనబరిచారు. తీవ్ర ఒత్తిడిలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. బ్రూక్ 234 బంతుల్లో 158 రన్స్ చేసి అవుటయ్యారు. బ్రూక్ అవుటైనా స్మిత్ మాత్రం చివరి వరకూ అజేయంగా నిలిచాడు. 207 బంతుల్లో 184 పరుగులు చేశాడు. వీరిద్దరూ 6 వికెట్‌కు ఏకంగా 203 పరుగులు జతచేయడం గమనార్హం. వీరిద్దరి పోరాటంతోనే 200లోపే ఆలౌటవుతుందనుకున్న ఇంగ్లాండ్ 407 పరుగులు చేసింది.
చెలరేగిన సిరాజ్
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. మూడో రోజు అద్భుతమైన బౌలింగ్ చేసి బుమ్రాను లేని లోటును పూడ్చాడు. 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను నిలువరించాడు. అతనికితోడు ఆకాశ్ దీప్ కూడా రాణించాడు. అతను 4 వికెట్లు తీశాడు. ఓవర్‌నైట్ స్కోరు 77/3తో ఇంగ్లాండ్ ఆట కొనసాగించగా ఆరంభంలోనే సిరాజ్ గట్టి దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్‌లో సిరాజ్ రూట్(22)తోపాటు కెప్టెన్ స్టోక్స్(0)ను అవుట్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 84/5 స్కోరుతో నిలిచి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ సెంచరీలతో చెలరేగి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి క్రీజులో పాతుకపోవడంతో ఇంగ్లాండ్ గట్టి పోటీనిచ్చింది. చివరికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను అధిగమించలేకపోయింది. దానికి కారణం సిరాజ్, ఆకాశ్ దీపే. బ్రూక్‌ను అవుట్ చేసిన ఆకాశ్ దీప్ స్మిత్‌తో భారీ భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కుప్పకూలడానికి ఎంతో సేపు పట్టలేదు. కాసేపటికే ఆకాశ్.. క్రిస్ వోక్స్(5)ను పెవిలియన్ చేర్చాడు. ఇక, చివరి మూడు వికెట్లు సిరాజ్ ఖాతాలోనే చేరాయి. బ్రైడెన్ కార్సే(0), జోష్ టంగ్(0), షోయబ్ బషీర్(0)లను అవుట్ చేసి ఇంగ్లాండ్ ఆట ముగించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.






