గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించండి.. సెలెక్టర్లను కోరిన గవాస్కర్

by Harish |

శుభ్‌మన్ గిల్‌కు వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పగించాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సెలెక్టర్లను కోరాడు.

గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించండి.. సెలెక్టర్లను కోరిన గవాస్కర్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు వన్డే జట్టు పగ్గాలు కూడా అప్పగించాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సెలెక్టర్లను కోరాడు. అతన్ని వన్డే కెప్టెన్‌గా నియమించడానికి ఇదే సరైన సమయమని అభిప్రాయపడ్డాడు. సోమవారం గవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రోహిత్, కోహ్లీ వన్డేలకు అందుబాటులో ఉన్నారు. వారు ఇంకా ఎంపిక కాలేదు. అన్ని విషయాలు సెలెక్షన్ కమిటీ ముందు ఉన్నాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. సెలెక్టర్లు గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమించాలనుకుంటే ఇదే సరైన సమయం.’అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

అలాగే, రెండో టెస్టులో గిల్(269)డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఆ పర్ఫామెన్స్‌ను గవాస్కర్ గుర్తు చేస్తూ గిల్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘గిల్ జట్టులో బాగా ఇష్టపడే ప్లేయర్లలో ఒకడు. అతను సెంచరీలు చేయగలడు. శతకాలతో సంతృప్తిగా లేడంటే డబుల సెంచరీ చేస్తాడు. ద్విశతకంతో కూడా సంతోష పడకపోతే ట్రిపుల్ సెంచరీ కోసం చూస్తాడు. రెండో టెస్టులో అతను 269 రన్స్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గనని చూపిస్తున్నాడు. క్రీజులో ఉండాలని, ప్రతి పరుగు ముఖ్యమైందేనని అతను భావిస్తున్నాడు.’అని గవాస్కర్ తెలిపాడు. రోహిత్ శర్మ టెస్టు కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు ముందు గిల్‌‌ను టెస్టు కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. గిల్ తన తొలి సిరీస్‌లోనే సారథిగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వన్డే జట్టుకు రోహిత్ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.


Next Story