- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరిత్ర సృష్టించిన గిల్.. నాలుగోసారి ఆ అవార్డు కైవసం
టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను మరోసారి ఐసీసీ మంత్లీ అవార్డు వరించింది.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను మరోసారి ఐసీసీ మంత్లీ అవార్డు వరించింది. జూలై నెలకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ఐసీసీ మంగళవారం వెల్లడించింది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ అదరగొట్టాడు. జూలైలో మూడు టెస్టులు ఆడిన అతను 94.50 సగటుతో 567 రన్స్ చేశాడు. అందులో ఓ డబుల్ సెంచరీతోపాటు రెండు శతకాలు బాదాడు. గిల్ అసాధారణ ప్రదర్శనను గుర్తించిన ఐసీసీ మంత్లీ అవార్డుకు నామినేట్ చేసింది. గిల్‌తోపాటు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్, సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ ముల్డర్ కూడా అవార్డు కోసం పోటీపడ్డారు. కానీ, వారిని గిల్ వెనక్కినెట్టాడు. ఐసీసీ మంత్లీ అవార్డు గెలవడం గిల్‌కు ఇది నాలుగోసారి కావడం విశేషం. ఈ ఏడాది రెండోసారి. ఇంతకుముందు 2023లో జనవరిలో, సెప్టెంబర్‌లో అవార్డు పొందిన అతను ఈ ఏడాది ఫిబ్రవరి నెలకుగానూ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నిలిచాడు. నాలుగుసార్లు మంత్లీ అవార్డు గెలిచిన తొలి పురుష క్రికెటర్‌గా గిల్ రికార్డు నెలకొల్పాడు. మూడు సార్లు అవార్డు గెలిచిన పాక్ క్రికెటర్ బాబర్ ఆజామ్‌ను వెనక్కినెట్టాడు. మహిళల విభాగంలో ఇప్పటివరకు ఆస్ట్రేలియాకు చెందిన ఆష్ గార్డ్‌నెర్, వెస్టిండస్ కెప్టన్ హేలీ మాథ్యూస్ మాత్రమే ఈ ఘనత సాధించారు.
డబుల్ సెంచరీని మర్చిపోలేను : గిల్
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు దక్కడంపై గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు. అలాగే, బర్మింగ్‌హోమ్ టెస్టులో డబుల్ సెంచరీని తానెప్పుడు మర్చిపోలేనని తెలిపాడు. ఇంగ్లాండ్‌లో తనకు అది హైలెట్‌గా ఉంటుందన్నాడు. ‘కెప్టెన్‌గా ఇంగ్లాండ్ టూరు నుంచి ఎంతో నేర్చుకున్నా. ఇరు జట్ల నుంచి అద్భుతమైన ప్రదర్శనలు వచ్చాయి. ఇరు జట్ల ప్లేయర్లు ఈ సిరీస్‌ను చాలా కాలం గుర్తు చేసుకుంటారు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ దేశానికి మరిన్ని అవార్డు తీసుకొస్తా.’అని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ టూరులో మొత్తం గిల్ 754 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడ గెలిచాడు. అలాగే, తొలి టెస్టు సిరీస్‌లోనే కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. అతని సారథ్యంలో భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమంగా ముగించింది.






