- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేయడం కష్టం : గిల్
భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్థానాలను భర్తీ చేయడం కష్టమేనని టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్థానాలను భర్తీ చేయడం కష్టమేనని టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, గిల్ గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గిల్ పలు విషయాల గురించి మాట్లాడాడు. కెప్టెన్‌గా అవకాశం వచ్చిన విషయం తెలియగానే చాలా సంతోషపడ్డానని చెప్పాడు. రోహిత్, గిల్ టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడంపై స్పందిస్తూ..‘ప్రతి పర్యటనలోనూ ఒత్తిడి ఉంటుంది. అనుభవజ్ఞులైన వారు, ఎన్నోసార్లు జట్టును గెలిపించిన ఇద్దరు లేకపోవడం కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. వారి స్థానాలను భర్తీ చేయడం చాలా కష్టం. కానీ, మా ఆటగాళ్లు అలవాటు పడ్డారు.’అని తెలిపాడు. తన కెప్టెన్సీ స్టైల్ గురించి మాట్లాడుతూ.. తనకంటూ ప్రత్యేకమైన శైలి లేదన్నాడు. ‘ముందుగా అనుభవం సంపాదించాలి. అప్పుడే నా వ్యక్తిగత శైలి బయటకు వస్తుంది. ఆటగాళ్లతో మాట్లాడటం నాకు ఇష్టం. వారితో మంచి సంబంధం కావాలి. అది చాలా ముఖ్యం. అప్పుడే వారి బలహీనతలు అర్థమవుతాయి. ప్లేయర్లు భద్రతగా ఫీలైతే 100 శాతం అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు.’అని గిల్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ తన బ్యాటింగ్ పొజిషన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. లండన్‌లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్, 10రోజుల క్యాంప్ తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపాడు.
బుమ్రా మూడు టెస్టులు ఆడతాడు : గంభీర్
బెంగళూరు తొక్కిసలాటపై గంభీర్ స్పందిస్తూ..గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులోనూ తాను రోడ్ షోలను నమ్మనన్నాడు. విజయం ముఖ్యమే, కానీ జీవితాలు అంతకంటే ముఖ్యమైనవని తెలిపాడు. ‘ఇంగ్లాండ్ పరిస్థితులను బట్టి ఉత్తమమైన తుది జట్టును ఎంపిక చేస్తాం. 1,000 రన్స్ చేసినా గెలుస్తామని చెప్పలేం. కానీ, 20 వికెట్లు తీస్తే మాత్రం టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించొచ్చు.’ అని చెప్పాడు. బుమ్రా వర్క్‌లోడ్ గురించి మాట్లాడుతూ.. ఇంగ్లాండ్‌లో అతను మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని, ఏ మ్యాచ్‌లు అనేది సిరీస్ సాగే తీరుపై ఉంటుందన్నాడు. బుమ్రాను రిప్లేస్ చేయడం కష్టమైనప్పటికీ తమకు నాణ్యమైన బౌలర్లు ఉన్నారని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ.. ఫామ్‌లో ఉంటే ఎవరినైనా ఎంపిక చేయొచ్చని, కానీ 18 మందిని మాత్రమే సెలెక్ట్ చేసే అవకాశం ఉందన్నాడు. చీఫ్ సెలెక్టర్ ఇప్పటికే దీనికి సమాధానమిచ్చాడన్నాడు. ఒత్తిడి గురించి మాట్లాడుతూ.. ఫలితాలతో సంబంధం లేకుండా ఒత్తిడికి గురవుతానని చెప్పాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లు కోల్పోయిన తర్వాత ఒత్తిడికి గురయ్యానని, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత కూడా ప్రెజర్ అనుభవించినట్టు తెలిపాడు.






