తిలక్ స్థానంలో డేంజరస్ బ్యాటర్.. కివీస్‌తో టీ20 సిరీస్‌‌కు ఎంపిక చేసిన సెలెక్టర్లు

by Harish |

తిలక్ స్థానంలో డేంజరస్ బ్యాటర్.. కివీస్‌తో టీ20 సిరీస్‌‌కు ఎంపిక చేసిన సెలెక్టర్లు
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రెండేళ్ల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి పునరాగమనం చేయబోతున్నాడు. ఇదే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. డిసెంబర్ 20నే కివీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ జట్టులో భాగమైన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ సర్జరీ కారణంగా తొలి మూడు టీ20లకు దూరమైన విషయం తెలిసిందే. తిలక్ స్థానంలో సెలెక్టర్లు తాజాగా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. అయ్యర్ తొలి మూడు టీ20లకు సెలెక్ట్ చేసినట్టు బోర్డు శుక్రవారం తెలిపింది. మిగతా రెండు మ్యాచ్‌లకు కూడా తిలక్ అందుబాటులో లేకపోతే అయ్యరే కొనసాగే అవకాశాలు ఉంటాయి. అయ్యర్ చివరిసారిగా 2023 డిసెంబర్‌లో భారత్ తరపున టీ20 మ్యాచ్‌ ఆడాడు.

మరోవైపు, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా టీ20 సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. కివీస్‌తో తొలి వన్డేలో బౌలింగ్ చేసేటప్పుడు పక్కటెముక కింది భాగంలో అసౌకర్యానికి గురయ్యాడు. స్కానింగ్‌లో సైడ్ స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని, కొన్ని రోజులపాటు అతనికి వైద్యులు విశ్రాంతి సూచించారని బోర్డు తెలిపింది. ఇప్పటికే సుందర్ వన్డే సిరీస్‌‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదని బోర్డు పేర్కొంది. అతని స్థానంలో టీ20 జట్టులోకి స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను తీసుకున్నట్టు వెల్లడించింది. భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు చెరోటి గెలవగా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్ ఆదివారం జరగనుంది. వన్డే సిరీస్ ముగిసిన వెంటనే ఐదు టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. నాగ్‌పూర్‌లో తొలి టీ20 జరగనుంది.


Next Story