డబ్ల్యూపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన తెలుగమ్మాయి శ్రీచరణి.. ఢిల్లీ అంత ధర పెట్టిందా?

by Harish |

మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)- 2026 వేలంలో తెలుగమ్మాయి శ్రీచరణి జాక్ పాట్ కొట్టింది.

డబ్ల్యూపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టిన తెలుగమ్మాయి శ్రీచరణి.. ఢిల్లీ అంత ధర పెట్టిందా?
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీలో జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)- 2026కు సంబంధించిన మెగా వేలంలో భారత స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ జాక్‌పాట్ కొట్టింది. ఆమె కోసం యూపీ వారియర్స్ రూ.3.20 కోట్లు కుమ్మరించింది. 2023 ప్రారంభ సీజన్ నుంచి యూపీకే ఆడుతున్న దీప్తి ఈ ఏడాది కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. అయితే, ఇటీవల ఫ్రాంచైజీ ఆమెను వేలంలోకి వదిలివేయడం అందరినీ ఆశ్చర్యపర్చింది. వేలంలో ఆమె తక్కువ మొత్తానికి దక్కించుకోవాలని చూసింది. కానీ, భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చింది. రూ. 50 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన దీప్తి కోసం ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా ఆసక్తి చూపింది. కానీ, యూపీ ఆర్‌టీఎం కార్డు ఉపయోగించింది. ఆ వెంటనే ఢిల్లీ ఏకంగా రూ. 3.20 కోట్ల బిడ్ వేసింది. అదే ధరకు ఆర్‌టీఎం ఉపయోగించడానికి యూపీ అంగీకరించింది. ఢిల్లీతోపాటు ఇతర ఫ్రాంచైజీలు బిడ్‌లు వేయకపోవడంతో దీప్తి తిరిగి యూపీ జట్టులో చేరింది. దీంతో డబ్ల్యూపీఎల్ వేలం చరిత్రలో దీప్తి సెకండ్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్‌గా నిలిచింది. 2023లో ఆర్సీబీ స్మృతి మంధానకు రూ.3.40 కోట్లు చెల్లించిన విషయం తెలిసిందే. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ గెలవడంలో దీప్తి కీలక పాత్ర పోషించింది. 215 రన్స్ చేయడంతోపాటు 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచింది.

తెలుగమ్మాయికి జాక్‌పాట్

భారత యువ సంచలనం, తెలుగమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి కూడా వేలంలో జాక్‌పాట్ కొట్టింది. ఆమెను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.1.30 కోట్లకు దక్కించుకుంది.ఈ ఏడాది ఆమె ఢిల్లీకే ఆడింది. వేలంలో రూ.55 లక్షలకు తీసుకుంది. ఈ సారి రూ. 30 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన శ్రీచరణి కోసం ఢిల్లీ భారీ ధర చెల్లించడానికి వెనుకాడలేదు. ఈ యువ స్పిన్నర్ ఇటీవల ప్రపంచకప్‌లో అదరగొట్టడమే కారణం. భారత్ ప్రపంచకప్ గెలవడంలో శ్రీచరణిది కూడా ముఖ్య పాత్ర పోషించింది. 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసింది. దీప్తి తర్వాత భారత జట్టులో అత్యధిక వికెట్లు తీసింది శ్రీచరణినే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీచరణిది కడప జిల్లా. ఆమె ఈ ఏడాది ఏప్రిల్‌లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసింది.

ప్రస్తుతం అత్యధిక ధర పలికిన ప్లేయర్లు

దీప్తి శర్మ రూ.3.2 కోట్లు(యూపీ వారియర్స్)

అమేలియా కెర్ రూ. 3 కోట్లు (ముంబై ఇండియన్స్)

సోఫి డివైన్ రూ. 2 కోట్లు (గుజరాత్ జెయింట్స్)

మెగ్ లానింగ్ రూ. 1.9 కోట్లు(యూపీ వారియర్స్)

చినెల్లె హెన్రీ రూ.1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

శ్రీచరణి రూ.1.3 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)

లిచ్‌ఫీల్డ్ రూ.1.2 కోట్లు (యూపీ వారియర్స్)

లారా వొల్వార్డ్ రూ.1.1 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)


Next Story