న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల కలకలం.. NBA ఛాంపియన్‌షిప్‌ సంబరాలు హింసాత్మకం

by Ramesh Naini |

53 ఏళ్ల తర్వాత NBA ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన న్యూయార్క్ నిక్స్ జట్టు విజయోత్సవాలు హింసాత్మకంగా మారాయి.

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల కలకలం.. NBA ఛాంపియన్‌షిప్‌ సంబరాలు హింసాత్మకం
X

దిశ, డైనమిక్ బ్యూరో: 53 ఏళ్ల తర్వాత NBA ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన న్యూయార్క్ నిక్స్ (New York Knicks) జట్టు విజయోత్సవాలు హింసాత్మకంగా మారాయి. టైమ్స్ స్క్వేర్‌లో అర్ధరాత్రి జరిగిన సంబరాల సందర్భంగా కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనలో 17 ఏళ్ల బాలుడు కాలికి తూటా గాయంతో ఆస్పత్రిలో చేరాడు. 42వ స్ట్రీట్ బ్రాడ్‌వే జంక్షన్‌లో జరిగిన కాల్పుల అనంతరం పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, సంఘటన స్థలం నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. సంబరాల సందర్భంగా నలుగురు కత్తిపోట్లకు గురికాగా, పలువురు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సమాచారం.

వాహనాలకు నిప్పు - పోలీసులపై దాడులు:

అల్లరి మూకలు పోలీసు వాహనాలు, స్కూల్ బస్సులను ధ్వంసం చేసి, కొన్ని వాహనాలకు నిప్పంటించారు. ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం వినియోగిస్తున్న స్కూల్ బస్సులపైకి ఎక్కి విధ్వంసానికి పాల్పడ్డారు. ఘర్షణల్లో 10 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు మొత్తం 63 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులపై దాడి, ఆయుధాల అక్రమ కలిగి ఉండటం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం తదితర కేసులు నమోదు చేశారు. NBA ఛాంపియన్‌షిప్‌‌లో భాగంగా సాన్ ఆంటోనియో స్పర్స్‌ను ఓడించి, 1973 తర్వాత న్యూయార్క్ నిక్స్ జట్టు ఎన్‌బీఏ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. అల్లర్ల నేపథ్యంలో, గురువారం జరగనున్న జట్టు విజయోత్సవ పరేడ్ (విక్టరీ పరేడ్) దృష్ట్యా పోలీసులు నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Next Story