హీరో విజయ్‌ దేవరకొండకు షాక్.. లీగల్‌ నోటీసులు పంపిన TCA

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-17 10:56:58  IST  )

హీరో విజయ్‌ దేవరకొండకు షాక్.. లీగల్‌ నోటీసులు పంపిన TCA
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీజీ20 (TG20) లీగ్’ చుట్టూ లీగల్ వివాదాలు కమ్మేస్తున్నాయి. తాజాగా ఈ లీగ్‌ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) లీగల్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. బీసీసీఐ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే హెచ్‌సీఏ టీజీ20 లీగ్‌ను నిర్వహిస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. బీసీసీఐ పర్మీషన్ లేని లీగ్‌ను అక్రమంగా ప్రమోట్ చేయడం చట్టప్రకారం నేరమని టీసీఏ స్పష్టం చేసింది. అదేవిధంగా ఈ లీగ్ పేరుతో హెచ్‌సీఏ నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ కంపెనీలతో రూ.వందల కోట్ల వ్యాపారాలు చేస్తోందని మండిపడింది.

ప్రముఖులకు అందిన లీగల్ నోటీసులు..

వినియోగదారులు, యువ క్రికెటర్లను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఈ లీగ్‌ను ప్రమోట్ చేయడాన్ని తప్పుబడుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్‌లతో పాటు స్టార్ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, అంబటి రాయుడు లీగల్ నోటీసులు పంపింది. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న ఈ లీగ్‌పై పునరాలోచన చేయాలని, లేని పక్షంలో చట్టపరంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో టీసీఏ స్పష్టంగా పేర్కొంది.

Next Story