ఆస్ట్రేలియాతో సెమి ఫైనల్.. భారత జట్టులోకి విధ్వంసకర బ్యాటర్

by Malleboina Mahesh |

మహిళల వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో సెమి ఫైనల్ వేళ భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. భారత ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది.

ఆస్ట్రేలియాతో సెమి ఫైనల్.. భారత జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
X

దిశ, వెబ్ డెస్క్: మహిళల వరల్డ్ కప్‌ (Women's World Cup)లో ఆస్ట్రేలియాతో సెమి ఫైనల్ (Semi final) వేళ భారత జట్టుకు ఊహించని షాక్ తగిలింది. భారత ఓపెనర్ ప్రతీక రావల్ (Pratika Rawal) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. మంచి ఫామ్‌లో ఉన్న ఆమె ఆస్ట్రేలియాతో సెమీస్‌కు దూరమవడం భారత జట్టుకు భారీ దెబ్బ గా మారింది. అయితే ఆమె స్థానంలో షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. ప్రతీక రావల్ స్థానంలో షఫాలీ వర్మ (Shafali Verma)ను జట్టులోకి చేర్చినట్లు సోమవారం ఐసీసీ అధికారికంగా ధృవీకరించింది. ఈ మార్పుకు ఈవెంట్‌ టెక్నికల్‌ కమిటీ ఆమోదం కూడా లభించింది.

గాయపడ్డ ప్రతికా రావల్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన షఫాలీ వర్మ ప్రస్తుతం దేశీయ క్రికెట్‌లో దూసుకుపోతుంది. సీనియర్‌ మహిళల T20 లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా షఫాలీ నిలిచింది. ఆమె హర్యానా తరఫున ఏడు ఇన్నింగ్స్‌ల్లో 341 పరుగులు అందులో ఒక శతకం, రెండు అర్ధ శతకాలు సాధించింది. ఆమె సగటు 56.83 కాగా, స్ట్రైక్‌ రేట్‌ 182.35. ఈ ఫార్మ్‌లో ఉన్న షఫాలీ ఇప్పుడు భారత జట్టులో చేరడం టీమ్‌ ఇండియాకు మంచి ఊరటనిచ్చే పరిణామంగా మారింది.

హర్యానా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న షఫాలీ ప్రస్తుతం సూరత్‌లో ఉన్న సమయంలో జట్టులోకి పిలుపు అందుకుంది. మంగళవారం నాటి టీమ్‌ ట్రైనింగ్‌ సెషన్‌ కోసం నవీ ముంబైలో రిపోర్ట్‌ చేసింది. గతంలో స్మృతీ మంధానాతో ఓపెనింగ్‌ జోడీగా ఆడిన షఫాలీ, గత ఏడాది న్యూజిలాండ్‌ సిరీస్‌ తర్వాత స్థిరత్వం లేక జట్టులోంచి తప్పించబడింది. అయితే ఇటీవల బెంగళూరులో జరిగిన భారత మహిళల "A" జట్టు, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వార్మ్‌అప్‌ మ్యాచ్‌లో ఆమె 49 బంతుల్లో 70 పరుగులతో మెరిపించి టీమ్‌ విజయానికి బాట వేసింది. ఈ ఫామ్‌లోనే ఆమె ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ ముందు జట్టులో చేరడం టీమ్‌ ఇండియాకు బలాన్నిచ్చే అంశంగా మారింది.

Next Story