ఆసియా గేమ్స్ మెడలిస్ట్‌పై లైంగిక ఆరోపణలు.. వేటు వేసిన శాయ్

by Harish |

ఆసియా గేమ్స్ మెడలిస్ట్‌పై లైంగిక ఆరోపణలు.. వేటు వేసిన శాయ్
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ బ్రాంజ్ మెడలిస్ట్, ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి భారత రోయర్ పీటీ పౌలోస్‌పై ఓ మహిళా రోయింగ్ కోచ్ లైంగిక ఆరోపణలు చేసింది. జనవరిలోనే ఆమె స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)కు ఫిర్యాదు చేయగా.. శాయ్ తాజాగా పౌలోస్‌ను సస్పెండ్ చేసింది. కేరళలోని అలెప్పీలో ఉన్న నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో 49 ఏళ్ల పౌలోస్ హై పర్ఫామెన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ మహిళా రోయింగ్ కోచ్ అతను లైంగిక వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. గతేడాది ఆరంభం నుంచి తనను వేధిస్తున్నాడని, అనుచితమైన మెసేజ్‌లు పంపిస్తున్నాడని, తన రూంలోకి కూడా వచ్చాడని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై విచారణ చేసిన శాయ్ గత నెలలో ఫౌలోస్‌ను ఇంపాల్‌లోని శాయ్ కేంద్రానికి బదిలీ చేసింది. తాజాగా సస్పెండ్ చేసింది. ప్రస్తుతం విచారణ జరుగుతుందని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని శాయ్ వెల్లడించింది. 2002 బుసాన్ ఆసియా గేమ్స్‌లో పౌలోస్ కాంస్య పతకం గెలిచాడు. అలాగే, 2004 ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు.

Next Story