SA Vs NZ: కివీస్ గడ్డపై దక్షిణాఫ్రికా రికార్డు విజయం.. టీ20 సిరీస్ కైవసం

by Kema Shiva Kumar |

న్యూజిలాండ్ గడ్డపై దక్షిణాఫ్రికా చారిత్రక విజయం సాధించింది. నిర్ణయాత్మకమైన 5వ టీ20లో కివీస్‌ను 33 పరుగుల తేడాతో మట్టికరిపించి ఏకంగా సిరీస్‌ను ఎగరేసుకుపోయింది.

SA Vs NZ: కివీస్ గడ్డపై దక్షిణాఫ్రికా రికార్డు విజయం.. టీ20 సిరీస్ కైవసం
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ (New Zealand) పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా (South Africa) జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇవాళ జరిగిన నిర్ణయాత్మకమైన ఐదో టీ20లో 33 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసి, 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ గడ్డపై దక్షిణాఫ్రికాకు ఇది మొట్టమొదటి టీ20 సిరీస్ విజయం కావడం విశేషం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. యువ బ్యాటర్ కానర్ ఎస్టెర్‌హజెన్ కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ రూబిన్ హెర్మన్ (39) కూడా రాణించడంతో దక్షిణాఫ్రికా పటిష్ట స్థితికి చేరుకుంది.

దుమ్ములేపిన బౌలర్లు..

188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి తడబడింది. గెరాల్డ్ కోయెట్జీ (2/21), ఒట్నీల్ బార్ట్‌మాన్ (2/33), వియాన్ ముల్డర్ (2/28) క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ న్యూజిలాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. కివీస్ బ్యాటర్లలో బెవాన్ జాకబ్స్ (36) మినహా మిగిలిన వారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఇక బ్యాటింగ్‌లో అదరగొట్టిన కానర్ ఎస్టెర్‌హజెన్ (Conor Esterhuysen) మ్యాచ్‌తో పాటు సిరీస్ మొత్తంలో అద్భుత ప్రదర్శన చేసినందుకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులను అందుకున్నాడు.

Next Story