వరల్డ్ నెంబర్ వన్ సబలెంకకు షాక్.. ర్యాబకీనాదే ఆస్ట్రేలియన్ ఓపెన్

by Phanindra |

వరల్డ్ నెంబర్ వన్ సబలెంకకు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో షాక్ తగిలింది. ర్యాబకీనా టైటిల్ నెగ్గింది.

వరల్డ్ నెంబర్ వన్ సబలెంకకు షాక్.. ర్యాబకీనాదే ఆస్ట్రేలియన్ ఓపెన్
X

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ స్టార్ ఎలీనా ర్యాబకీనా చరిత్ర సృష్టించింది. తన కెరీర్‌లో తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకుంది. మూడేళ్ల క్రితం మెల్‌బోర్న్‌లోని ఇదే స్టేడియంలో ఫైనల్‌లో తనను ఓడించిన వరల్డ్ నెంబవర్ వన్ అరీనా సబలెంకపై ప్రతీకారం తీర్చుకుంది. శనివారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో చిట్టచివరకు సబలెంకను ఓడించి, తొలి ఆస్ట్రేలియన్ గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకుందీ కజకస్తాన్ టెన్నిస్ స్టార్. మూడేళ్ల క్రితం తొలి రౌండ్ ఓడినా ఆ తర్వాత రెండు రౌండ్స్‌లో విజయం సాధించి ట్రోఫీ ఎగరేసుకుపోయిన సబలెంక.. ఈసారి కూడా మ్యాచ్‌ను అదే మాదిరి ప్రారంభించింది. తొలి రౌండ్‌లో 6-4తో ర్యాబకీనా విజయం సాధించింది.

అయితే రెండో రౌండ్లో పుంజుకున్న సబలెంక 6-4తో నెగ్గింది. నిర్ణయాత్మక మూడో రౌండ్‌లో ఇద్దరు ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. మూడేళ్ల క్రితం చేసిన తప్పిదాలను రిపీట్ చేయని ర్యాబకీనా 6-4తో పైచేయి సాధించి టైటిల్ గెలుచుకుంది. పవర్‌ఫుల్ సర్వ్‌లకు పేరొందిన ర్యాబకీనా.. ఈ టోర్నీలో 47 ఏస్‌లు సంధించింది. ఫైనల్‌లో కూడా అద్భుతమైన ఏస్‌తో విజయం సాధించింది. వింబుల్డన్ 2022 తర్వాత ర్యాబకీనా నెగ్గిన రెండో గ్రాండ్‌స్లామ్ ఇదే కావడం గమనార్హం. గతేడాది కూడా ఫైనల్ చేరిన సబలెంక.. అప్పుడు మాడిసన్ కీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు ర్యాబకీనా ముందు తలవంచింది.

Next Story