కామన్వెల్త్ గేమ్స్ 2026 : భారత్‌కు తొలి సిల్వర్ మెడల్

by Naga Rani Yarlagadda |

కామన్వెల్త్ గేమ్స్ 2026 ఎడిషన్‌లో భారత్‌కు తొలి సిల్వర్ మెడల్ లభించింది. ఈ సీజన్ లో భారత్ కు ఇది రెండో మెడల్ కావడం విశేషం.

కామన్వెల్త్ గేమ్స్ 2026 : భారత్‌కు తొలి సిల్వర్ మెడల్
X

దిశ, వెబ్‌డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ 2026 ఎడిషన్‌లో భారత్‌కు తొలి సిల్వర్ మెడల్ లభించింది. ఈ సీజన్ లో భారత్ కు ఇది రెండో మెడల్ కావడం విశేషం. ఆదివారం జరిగిన పురుషుల 60 కేజీల కేటగిరీ పోటీల్లో 28 ఏళ్ల భారత వెయిట్‌లిఫ్టర్ చనంబమ్ రుషికాంత్ సింగ్ అద్భుత ప్రదర్శనతో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తం 11 మంది పోటీపడిన ఈ విభాగంలో రుషికాంత్ సాధించిన పతకంతో, 23వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య రెండుకి చేరింది. అంతకుముందు పారా పవర్ లిఫ్టర్ జంధు కుమార్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ 60 కేజీల విభాగంలో మలేషియాకు చెందిన బిన్ కాస్దాన్ మహమ్మద్ అనీక్ స్వర్ణ పతకం సాధించగా, కెన్యాకు చెందిన జోషువా అముంగా మబోయా కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.

స్నాచ్ విభాగంలో రుషికాంత్ ఆరంభం నుంచే ఆధిక్యం ప్రదర్శించారు. తన మొదటి ప్రయత్నంలోనే 116 కేజీలు విజయవంతంగా ఎత్తి ప్రత్యర్థుల కంటే ముందు నిలిచారు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 119 కేజీలు, మూడో ప్రయత్నంలో 121 కేజీలను ఎత్తి మూడింటినీ విజయవంతంగా పూర్తి చేశారు. స్నాచ్ విభాగంలో ఆయన నమోదు చేసిన 121 కేజీల లిఫ్ట్, వ్యక్తిగత అత్యుత్తమ రికార్డుతో పాటు కామన్వెల్త్ గేమ్స్ స్నాచ్ రికార్డుగా నిలిచింది. స్నాచ్ ముగిసే సరికి రుషికాంత్, మలేషియాకు చెందిన అనీక్ చెరో 121 కేజీలతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలవడంతో స్వర్ణ పోరు క్లీన్ అండ్ జెర్క్ విభాగంపై ఆధారపడింది.

క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో రుషికాంత్ తొలి ప్రయత్నంలో 143 కేజీలను సులువుగా ఎత్తినప్పటికీ, రెండో ప్రయత్నంలో 148 కేజీలను ఎత్తడంలో విఫలమయ్యారు. దీనిని అవకాశంగా మలుచుకున్న మలేషియా లిఫ్టర్ అనీక్ తన రెండో ప్రయత్నంలో 149 కేజీలు ఎత్తి అగ్రస్థానాన్ని బలాపేతం చేసుకున్నారు. స్వర్ణ పతకం సాధించాలంటే రుషికాంత్ తన చివరి ప్రయత్నంలో ఖచ్చితంగా 151 కేజీలు ఎత్తాల్సి వచ్చింది. అయితే ఆఖరి ప్రయత్నంలో రుషికాంత్ 151 కేజీలు ఎత్తలేకపోవడంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రుషికాంత్ మొత్తం 264 కేజీలు (స్నాచ్ 121 కేజీలు + క్లీన్ అండ్ జెర్క్ 143 కేజీలు) ఎత్తగా, మలేషియా క్రీడాకారుడు అనీక్ మొత్తం 273 కేజీలతో స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నారు.

Next Story