గుజరాత్ సూపర్ ఛేజ్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-03 05:44:38  IST  )

బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గిల్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

గుజరాత్ సూపర్ ఛేజ్
X

- ఉతికి ఆరేసిన జాస్ బట్లర్

- రాణించిన సాయి సుదర్శన్, రూథర్‌ఫార్డ్

- ఆర్సీబీకి హోం గ్రౌండ్‌లో తప్పని నిరాశ

- మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2025లో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీద ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హోం గ్రౌండ్‌లోనే గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. వేలాది మంది కోహ్లీ, ఆర్సీబీ ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తూ ఈ సీజన్‌లో తొలి ఓటమిని మూటగట్టుకుంది. ఒకప్పుడు ఆర్సీబీకి ఆడిన మహ్మద్ సిరాజ్.. తనకు కలిసొచ్చిన గ్రౌండ్‌లో మాజీ టీమ్‌పై నిప్పులు చెరిగి టాపార్డర్‌ను కకావికలం చేశాడు. మొత్తంగా బౌలింగ్, బ్యాటింగ్‌లో సమిష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్ ఏకంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.

బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గిల్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 170 పరుగులు సాధారణ లక్ష్యాన్ని అలవోకగా ఛేధించింది. ఆర్సీబీ బౌలర్లను గుజరాత్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (14) తక్కువ పరుగులకే అవుటయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన జాస్ బట్లర్.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్‌తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా బౌండరీలు, సిక్సులతో చినస్వామి స్టేడియంను మార్మోగించారు. గత మ్యాచ్‌లో తమ బౌలింగ్ బలంతో సీఎస్కే జట్టును గడగడలాడించిన ఆర్సీబీ బౌలర్లు.. ఈ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. సాయి సుదర్శన్ (49), జాస్ బట్లర్ కలిసి రెండో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్‌ను హాజెల్‌వుడ్ అవుట్ చేశాడు. ఇక ఆ తర్వాత జాస్ బట్లర్ (73), రూథర్‌ఫార్డ్ (30) కలిసి మరో వికెట్ పడకుండా టార్గెట్ ఛేజ్ చేశారు. బట్లర్ కేవలం 39 బంతుల్లో 73 పరుగులు, రూథర్‌ఫార్డ్ 18 బంతుల్లో 30 పరుగులు చేశారు. దీంతో కేవలం 17.5 ఓవర్లలోనే 170 పరుగులు చేసి.. గుజరాత్ టైటాన్స్‌కు అద్భుత విజయాన్ని అందించారు. హాజెల్‌వుడ్, భువనేశ్వర్‌కు తలా ఒక వికెట్ లభించింది. మహ్మద్ సిరాజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఆదుకున్న లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ..

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తడబడింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మంచి ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(7)ని అర్షద్ ఖాన్ అవుట్ చేశాడు. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (14).. వన్ డౌన్‌లో వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (4)లను మహ్మద్ సిరాజ్ పెవీలియన్‌కు పంపాడు. ఇక రజత్ పాటిదార్ (12)ను ఇషాత్ శర్మ అవుట్ చేశాడు. దీంతో 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే లియామ్ లివింగ్‌స్టోన్‌తో కలిసి జితేశ్ శర్మ ఆర్సీబీ బ్యాటింగ్‌ను గాడిన పెట్టారు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జితేశ్ (33) అవుటైన తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా (5) కూడా తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అయితే లివింగ్‌స్టోన్ (54) మాత్రం సిక్సులు, బౌండరీలతో కదం తొక్కాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ (32) చెలరేగడంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మహ్మద్ సిరాజ్ 3, సాయి సుదర్శన్ 2 వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మకు తలా ఒక వికెట్ లభించింది.

స్కోర్ బోర్డు :

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు : ఫిల్ సాల్ట్ (బి) మహ్మద్ సిరాజ్ 14, విరాట్ కోహ్లీ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అర్షద్ ఖాన్ 7, దేవ్‌దత్ పడిక్కల్ (బి) మహ్మద్ సిరాజ్ 4, రజత్ పాటిదార్ (ఎల్బీడబ్ల్యూ)(బి) ఇషాంత్ శర్మ 12, లియామ్ లివింగ్‌స్టోన్ (సి) జాస్ బట్లర్ (బి) మహ్మద్ సిరాజ్ 54, జితేశ్ శర్మ (సి) రాహుల్ తెవాతియా (బి) సాయి సుదర్శన్ 33, కృనాల్ పాండ్యా (సి) అండ్ (బి) సాయి సుదర్శన్ 5, టిమ్ డేవిడ్ (బి) ప్రసిధ్ కృష్ణ 32, భువనేశ్వర్ కుమార్ 1 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 7; మొత్తం 169/8(20 ఓవర్లు)

వికెట్ల పతనం : 8-1, 13-2, 35-3, 42-4, 94-5, 104-6, 150-7, 169-8

బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ (4-0-19-3), అర్షద్ ఖాన్ (2-0-17-1), ప్రసిధ్ కృష్ణ (4-0-26-1), ఇషాంత్ శర్మ (2-0-27-1), సాయి సుదర్శన్ (4-0-22-2), రషీద్ ఖాన్ (4-0-54-0)

గుజరాత్ టైటాన్స్ : సాయి సుదర్శన్ (సి) జితేశ్ శర్మ (బి) హాజెల్‌వుడ్ 49, శుభ్‌మన్ గిల్ (సి) లియామ్ లివింగ్‌స్టోన్ (బి) భువనేశ్వర్ కుమార్ 14, జాస్ బట్లర్ 73 నాటౌట్, షెఫానే రూథర్‌ఫార్డ్ 30 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 4; మొత్తం 170(17.5 ఓవర్లు)

వికెట్ల పతనం: 32-1, 107-2

బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ (4-0-23-1), జోష్ హాజెల్‌వుడ్ (3.5-0-43-1), యశ్ దయాల్ (3-0-20-0), రసీఖ్ దార్ సలామ్ (3-0-35-0), కృనాల్ పాండ్యా (3-0-34-0), లియామ్ లివింగ్‌స్టోన్ (1-0-12-0)

Next Story