Rohit Sharma : కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు

by Harish |   (  Updated:2025-05-16 16:51:27  IST  )

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది.

Rohit Sharma : కలలో కూడా ఇలా జరుగుతుందని ఊహించలేదు
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) నిర్ణయించిన విషయం తెలిసిందే. శుక్రవారం రోహిత్ శర్మ స్టాండ్‌ ప్రారంభోత్సవం జరిగింది. రోహిత్ తల్లిదండ్రులు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ రోహిత్ శర్మ స్టాండ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోహిత్, అతని భార్య రితిక ఎమోషనల్ అయ్యారు. వారి కళ్లలో నీళ్లు తిరిగాయి. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, మిజయ్ మర్చంట్ వంటి దిగ్గజ క్రికెటర్ల పేర్లతో వాంఖడేలో ఇప్పటికే స్టాండ్‌లు ఉన్నాయి. రోహిత్ వారి సరసన చేరాడు. అలాగే, ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో రోహిత్‌కే ఈ గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో ఎంసీఏ అధికారులు, ముంబై ఇండియన్స్ ప్లేయర్లు పాండ్యా, సూర్యకుమార్‌తోపాటు ఇతర ఆటగాళ్లు పాల్గొన్నారు.

కలలో కూడా ఊహించలేదు : రోహిత్

వాంఖడే స్టేడియంలో స్టాండ్‌‌కు తన పేరు పెట్టడం పట్ల రోహిత్ ఎమోషనల్ అయ్యాడు. ఇది తనను కలలో కూడా ఊహించలేదన్నాడు. కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు సాధించినప్పటికీ.. ఇది తనకు చాలా ప్రత్యేకమైందని చెప్పాడు. క్రికెట్ దిగ్గజాలు, అగ్ర రాజకీయ నాయకుల సరసన తన పేరు చూస్తుంటే మాటలు కూడా రావడం లేదన్నాడు. తాను ఆడుతున్నప్పుడే ఈ గౌరవం పొందడం చాలా ప్రత్యేకమైనదని తెలిపాడు. వాంఖడే స్టేడియంలో ఈ నెల 21న ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ ఆడేటప్పుడు తనకు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందన్నాడు.

Next Story