టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ను గుర్తు చేసుకున్న రోహిత్.. వారిద్దరికి క్రెడిట్ ఇచ్చిన హిట్‌మ్యాన్

by Harish |

గతేడాది రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌ను గుర్తు చేసుకున్న రోహిత్.. వారిద్దరికి క్రెడిట్ ఇచ్చిన హిట్‌మ్యాన్
X

దిశ, స్పోర్ట్స్ : గతేడాది రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో ఓడించి 17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్ టైటిల్ దక్కించుకుంది. ఈ నెల 29తో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడు.

జియోహాట్‌స్టార్‌తో హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో తాను చాలా టెన్షన్ పడ్డానని తెలిపాడు. సౌతాఫ్రికా గేములోకి వచ్చిందనుకున్నానని చెప్పాడు. కానీ, మా లోయర్ ఆర్డర్ తన నమ్మకాన్ని వమ్ముచేయలేదన్నాడు. ఈ సందర్భంగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు క్రెడిట్ ఇచ్చాడు. ఫైనల్‌లో అతను గేమ్ చేంజర్ అని చెప్పాడు. అక్షర్ ఇన్నింగ్స్ గురించి చాలా మంది మాట్లాడుకోవడం లేదని, ఆ సమయంలో అతను చేసిన 47 రన్స్ చాలా కీలకమైనవని గుర్తు చేశాడు. అలాగే, విరాట్ కోహ్లీ కూడా చివరి వరకూ నిలబడ్డాడని, అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు. కాగా, ఫైనల్‌లో రోహిత్(9), పంత్(0), సూర్య(3) నిరాశపర్చడంతో భారత్ 34/3 కష్టాల్లో పడింది. అప్పుడు కోహ్లీ(76), అక్షర్(47) ఆదుకోవడంతో టీమిండియా 176/7 స్కోరు చేయగలిగింది. ఇక, ఛేదనలో సౌతాఫ్రికా 169 పరుగులకే పరిమితమైంది.


Next Story