ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్‌కు విశ్రాంతి.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరం?

by Harish |

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీపై దృష్టి పెట్టనుంది.

ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్‌కు విశ్రాంతి.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు దూరం?
X

దిశ, స్పోర్ట్స్ : ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌లు ఆడేశాయి. ఆస్ట్రేలియా 2-1తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉన్నది. ఇక, మిగిలింది ఆఖరి టెస్టే. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రస్తుతం టీమిండియా ఆఖరి టెస్టులో విజయం సాధించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కాపాడుకోవాలని భావిస్తున్నది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలన్నా ఆ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీపై దృష్టి పెట్టనుంది. ఐసీసీ టోర్నీకి ముందు టీమిండియా.. సొంతగడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. వన్డేలతోపాటు టీ20ల్లో తలపడనుంది. చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ భారత్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. వన్డే సిరీస్ ముగిసిన 8 రోజుల తర్వాత టీమిండియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్‌ ఆడనుంది.

అయితే, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా ఇంగ్లాండ్‌ సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనంతరం ఈ ముగ్గురికి నెలరోజులపాటు విశ్రాంతినివ్వనున్నట్టు సమాచారం. రోహిత్, కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. కాబట్టి, టీ20 సిరీస్‌లో భాగం కాలేరు. కానీ, వన్డే సిరీస్‌కు కూడా వీరు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా టెస్టులు ఆడుతున్న వీరు వైట్‌బాల్ ఫార్మాట్‌కు తగినట్టు తమ ఆటను మార్చుకునేందుకు విశ్రాంతి అవసరమేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, స్టార్ పేసర్ బుమ్రా కూడా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. కాబట్టి, అతని కూడా రెస్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతను భీకర ఫామ్‌లో ఉన్నాడు. నాలుగు టెస్టుల్లో 30 వికెట్లు తీసి సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌ ఉన్నాడు. సీనియర్లకు విశ్రాంతినిస్తే ఇంగ్లాండ్‌‌తో వన్డే సిరీస్‌‌లో పలువురు యువ క్రికెటర్లకు జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. సిరీస్‌లో ప్రదర్శన ఆధారంగా చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ఎంపిక చేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.


Next Story