ఏజ్ ఫ్రాడ్ కేసులో లక్ష్యసేన్‌కు భారీ ఊరట.. విచారణపై స్టే విధించిన సుప్రీం కోర్టు

by Harish |

ఏజ్ ఫ్రాడ్ కేసులో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు భారీ ఊరట లభించింది.

ఏజ్ ఫ్రాడ్ కేసులో లక్ష్యసేన్‌కు భారీ ఊరట.. విచారణపై స్టే విధించిన సుప్రీం కోర్టు
X

దిశ, స్పోర్ట్స్ : ఏజ్ ఫ్రాడ్ కేసులో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో తదుపరి విచారణకు అనుమతినిచ్చిన కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే మంగళవారం విధించింది. 2010లో బ్యాడ్మింటన్ ఏజ్ గ్రూపు టోర్నీల్లో పాల్గొనేందుకు, ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి లక్ష్యసేన్, అతని సోదరుడు చిరాగ్ సేన్ వయసు మోసానికి పాల్పడ్డారని, లక్ష్యసేన్ తల్లిదండ్రులు, కోచ్ విమల్ కుమార్ రెండేన్నరేళ్లు తగ్గించి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై 2022లో ఎంజీ నాగరాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 19న కర్ణాటక హైకోర్టు ఈ కేసు విచారణను రద్దు చేయాలన్న లక్ష్యసేన్ అభ్యర్థనను తిరస్కరించింది. విచారణకు అనుమతినిచ్చింది. విచారణ చేపట్టడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులపై లక్ష్యసేన్ సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు. మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించిన భారత అత్యున్నత ధర్మాసనం కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన అపెక్స్ కోర్టు బెంచ్ తదుపరి విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 16న విచారణ జరగనుంది. సుప్రీం కోర్టు స్టేతో లక్ష్యసేన్, చిరాగ్ సేన్ తమ టోర్నీలపై ఫోకస్ పెట్టడానికి మార్గం సుగమమైంది.


Next Story