డోపింగ్‌లో భారతే టాప్.. అత్యంత ప్రమాదకరంగా మారిన దేశాల్లో చేరిన భారత్

by Harish |

డోపింగ్‌లో భారతే టాప్.. అత్యంత ప్రమాదకరంగా మారిన దేశాల్లో చేరిన భారత్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్‌లో డోపింగ్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. డోపింగ్ అత్యంత ప్రమాదకరంగా ఉన్న దేశంగా భారత్‌ను వరల్డ్ అథ్లెటిక్స్‌కు చెందిన అథ్లెటిక్స్ ఇంటెగ్రిటీ యూనిట్(ఏఐయూ) గుర్తించింది. ఇప్పటివరకు కేటగిరీ ‘బి’లో ఉన్న భారత్‌ను కేటగిరీ ‘ఏ’కు మార్చింది. ఈ కేటగిరీ‌లో డోపింగ్ సమస్య అత్యంత ప్రమాదకరంగా ఉండే దేశాలు ఉంటాయి. రష్యా, బెలారస్, ఇథియోఫియా, కెన్యా, నైజీరియా, ఉక్రెయిన్ ఈ కేటగిరీలో ఉండగా.. ఇప్పుడు భారత్‌ కూడా చేరింది. చాలా కాలంగా డోపింగ్‌లో తొలి, రెండు స్థానాల్లో ఉండటంతోనే భారత్‌ను హై రిస్క్ జాబితాలో చేర్చినట్టు ఏఐయూ వెల్లడించింది. ‘భారత్‌లో చాలా కాలంగా డోపింగ్ ప్రమాదకరంగా ఉంది. దేశీయ డోపింగ్ నిరోధక కార్యక్రమం నాణ్యత డోపింగ్ ముప్పుకు తగినట్టుగా లేదు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏఎఫ్ఐ) సంస్కరణలు చేస్తున్నా పెద్దగా మార్పు రాలేదు. అథ్టెటిక్స్ సమగ్రతను పరిరక్షించేందుకు ఏఎఫ్‌ఐతో ఏఐయూ కలిసి పనిచేస్తుంది.’అని ఏఐయూ చైర్మన్ డేవిడ్ హౌమన్ తెలిపారు. దీనిపై ఏఎఫ్ఐ స్పోక్ పర్సన్ అడిల్లె సుమరివాలా స్పందిస్తూ.. భారత్ అధికంగా డోప్ టెస్టులు చేయడం వల్లే ఎక్కువ మంది అథ్లెట్లు పట్టుబడ్డారని సమర్థించుకున్నారు. డోపింగ్‌కు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకోవాలని, తాము పోలీసులం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలసీని రూపొందించడమే తమ పని అని, డోపింగ్‌ను నేరంగా పరిగణించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

2022 నుంచి 2025 వరకు..

గత నాలుగేళ్లుగా అథ్లెటిక్స్‌లో యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న దేశాల్లో భారతే తొలి, రెండు స్థానాల్లో నిలుస్తుంది. ఏఐయూ డాటా ప్రకారం.. 2022‌లో 48(2వ ర్యాంక్), 2023‌లో 63(2వ ర్యాంక్), 2024లో 71(1వ ర్యాంక్), 2025‌లో 30(1వ ర్యాంక్) ఉల్లంఘనలు జరిగాయి. ఇక, డోపింగ్ కారణంగా అత్యధికంగా సస్పెండ్ అయిన అథ్లెట్లు భారత్‌లోనే ఎక్కువ. 148 మంది సస్పెండ్‌కు గురయ్యారు. ఇంతకుముందు కెన్యా అగ్రస్థానంలో ఉండగా.. ఆ దేశాన్ని భారత్ అధిగమించింది.

ఇకపై ఈ రూల్స్ పాటించాల్సిదే

‘ఏ’ కేటగిరీలో చేరడంతో భారత అథ్లెట్లు డోపింగ్ రూల్స్‌ పాటించడం ఇక తప్పనిసరి కానుంది. వరల్డ్ అథ్లెటిక్స్ యాంటీ డోపింగ్ రూల్స్ ప్రకారం.. ఏఎఫ్‌ఐ రూల్ 15 కిందికి వస్తుంది. దీంతో ఏఎఫ్‌ఐ అంత్జాతీయ ప్రమాణాలకుక అనుగుణంగా ప్రతి ఏడాది పరీక్షలు నిర్వహించాడు. సమాచారం ఇవ్వకుండానే అథ్లెట్లను టెస్టు చేయొచ్చు. ఇతర దేశాల్లో శిక్షణ తీసుకుంటున్న అథ్లెట్లను కూడా పరీక్షించాలి. ఏఐయూ నిర్దేశించిన 10 నెలల వ్యవధిలో ముందు సమాచారం లేకుండా నిర్వహించే మూడు పోటీయేతర టెస్టుల్లో పాల్గొనాలి. పాల్గొనని అథ్లెట్లు వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనడానికి అనర్హులు.

ఒలింపిక్స్-2026 ఆతిథ్య హక్కులపై ఎఫెక్ట్

ఒలింపిక్స్-2026 ఆతిథ్య హక్కుల కోసం ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్న వేళ భారత్‌‌ను డోపింగ్ సమస్య ఆందోళనకు గురిచేస్తుంది. ఈ విశ్వక్రీడలకు భారత్ ఇప్పటికే బిడ్ వేసిన విషయం తెలిసిందే. హోస్టింగ్ రైట్స్ రేసులో ముందు వరుసలో కూడా ఉంది. ఈ ఏడాది చివరిలో లేదా 2027 ఆరంభంలో ఆతిథ్య హక్కులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో డోపింగ్‌లో భారత్ అగ్రస్థానంలో ఉండటం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. క్రీడా ప్రపంచంలో ఇండియాపై కచ్చితంగా ఇది నెగటివ్ ఇమేజ్‌ను సృష్టిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.


Next Story