WPL 2025 : ఆర్సీబీ ఎలిమినేట్.. కీలక మ్యాచ్‌లో యూపీ చేతిలో పరాజయం

by Harish |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది.

WPL 2025 : ఆర్సీబీ ఎలిమినేట్.. కీలక మ్యాచ్‌లో యూపీ చేతిలో పరాజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎలిమినేట్ అయ్యింది. యూపీ వారియర్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు ఓటమిపాలవడంతో ఆ జట్టు నిష్ర్కమణ ఖరారైంది. లక్నో వేదికగా శనివారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 12 రన్స్ తేడాతో బెంగళూరును ఓడించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న యూపీ విజయంతో టోర్నీని ముగించింది. పోతూ పోతూ ఆర్సీబీని కూడా ఎలిమినేట్ చేసింది. ముందుగా యూపీ నిర్ణీత 20 ఓవర్లలో భారీ స్కోరు 225/5 చేసింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే హయ్యెస్ట్ స్కోరు. జార్జియా వాల్(99 నాటౌట్), కిరణ్(46) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. గ్రేస్ హ్యారిస్(39) కూడా రాణించింది. అనంతరం ఛేదనలో ఆర్సీబీ గట్టిగానే పోరాడింది. కానీ, యూపీ బౌలర్లు ఆ జట్టును నిలువరించారు. దీంతో బెంగళూు 19.3 ఓవర్లలో 213 పరుగులు చేసి ఆలౌటైంది. రిచా ఘోష్(69), స్నేహ్ రాణా(26 నాటౌట్), ఎల్లీస్ పెర్రీ(28), మేఘన(27) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇక, ఆర్సీబీ తమ చివరి నామమాత్రపు గ్రూపు మ్యాచ్‌లో ఈ నెల 11న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

యూపీ దంచికొట్టింది

యూపీ ఇన్నింగ్స్‌లో టాపార్డర్ రెచ్చిపోయి ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ జార్జియా వాల్ అదిరిపోయే ఆరంభం అందించడమే కాకుండా చివరి వరకూ నిలిచి జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. మరో ఓపెనర్ గ్రేస్ హ్యారిస్‌, జార్జియా ఎడాపెడా బౌండరీలు కొట్టడంతో పవర్ ప్లేలో 67 పరుగులు వచ్చాయి. అయితే, కాసేపటికే హ్యారిస్‌ రనౌటవడంతో ఈ జోడీ విడిపోయింది. ఇక, క్రీజులోకి వచ్చిన కిరణ్ నవ్‌గిరే మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. 16 బంతులే ఎదుర్కొన్న ఆమె సిక్సర్ల మోత మోగించి పరుగుల వరద పారించింది. హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న కిరణ్‌ను జార్జియా వారేహమ్ అవుట్ చేసి ఆమె దూకుడుకు బ్రేక్ వేసింది. మరో ఎండ్‌లో జోరు కొనసాగించిన జార్జియా 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. కిరణ్, జార్జియా వాల్ మెరుపులతో 13 ఓవర్లలోనే 150 స్కోరును దాటిన యూపీ భారీ స్కోరుపై కన్నేసింది. చినెల్లె హెన్రీ(19),ఎక్లోస్టోన్(13), దీప్తి శర్మ(1) నిరాశపర్చినా.. జార్జియా వాల్ మాత్రం చివరి వరకూ క్రీజులో ఉండటంతో యూపీ 225 స్కోరు చేసింది.

పోరాటం సరిపోలే

ఇక, ఛేదనలో ఆర్సీబీ విజయం కోసం చివరి వరకూ తీవ్రంగా శ్రమించింది. ఆరంభంలోనే ఆ జట్టుకు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ స్మృతి మంధాన(4)కీలక మ్యాచ్‌లో నిరాశపర్చింది. అనంతరం సబ్బినేని మేఘన(27), ఎల్లీస్ పెర్రీ(28) కాసేపు దూకుడుగా ఆడి అవుటయ్యారు. పవర్ ప్లేలో వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఆర్సీబీ స్కోరు 70/2తో మెరుగైన స్థితిలోనే నిలిచింది. అయితే, పెర్రీ, రఘ్వి బిస్ట్(14), కనిక(8) స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీ వెనుకబడింది. ఈ పరిస్థితుల్లో రిచా ఘోష్ జట్టును ఆదుకుంది. 33 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో మెరుపులు మెరిపించిన ఆమె 171/5తో జట్టును తిరిగి పోటీలోకి తీసుకొచ్చింది. కీలక సమయంలో రిచా ఘోష్‌ను దీప్తి అవుట్ చేసి ఆర్సీబీకి బిగ్ షాకివ్వడంతో యూపీ తిరిగి పుంజుకుంది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే జార్జియా వారేమ్(17), షార్లెట్ డీన్(9) అవుటవ్వగా.. టెయిలెండర్ స్నేహ్ రాణా(26) చిన్నపాటి విధ్వంసం సృష్టించింది. దీప్తి వేసిన 19 ఓవర్‌లో 28 పరుగులు పిండుకుంది. అయితే, అదే ఓవర్‌లో ఆఖరి బంతికి ఆమె వికెట్ పారేసుకుంది. ఇక చివరి ఓవర్‌లో ఆర్సీబీకి 28 రన్స్ అవసరమయ్యాయి. అయితే, మూడో బంతికి చివరి వికెట్‌గా రేణుక(1) అవుటవడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆర్సీబీ ఆలౌటైంది. యూపీ బౌలర్లలో ఎక్లోస్టోన్, దీప్తి చెరో మూడు వికెట్లతో ఆర్సీబీ పతనాన్ని శాసించారు.

Next Story