WPL 2025 : ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యూపీ అద్భుత విజయం.. సూపర్ ఓవర్‌లో ఆర్సీబీకి షాక్

by Harish |

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ అద్భుత విజయం నమోదు చేసింది.

WPL 2025 : ఉత్కంఠభరిత మ్యాచ్‌లో యూపీ అద్భుత విజయం.. సూపర్ ఓవర్‌లో ఆర్సీబీకి షాక్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఓడాల్సిన మ్యాచ్‌లో ఎక్లోస్టోన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుత విజయం సాధించింది. సోమవారం బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో యూపీ సూపర్ ఓవర్‌లో విజయఢంకా మోగించింది. ముందుగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 రన్స్ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి.. కెప్టెన్ స్మృతి మంధాన(6) నిరాశపర్చడంతో శుభారంభం దక్కలేదు. క్రీజులోకి వచ్చిన ఎల్లీస్ పెర్రీ(90) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగిన ఆమె అజేయంగా 90 రన్స్ చేసింది. మరో ఓపెనర్ వ్యాట్ హోడ్జ్(57) కూడా సత్తాచాటింది. హాఫ్ సెంచరీతో మెరిసింది. పెర్రీ చివరి వరకూ బ్యాటు ఝుళిపించడంతో ఆర్సీబీకి భారీ స్కోరు దక్కింది.

అయితే, ఛేదనలో సమిష్టిగా రాణించిన యూపీ కూడా నిర్ణీత ఓవర్లలో 180 రన్సే చేసి ఆలౌటైంది. శ్వేత సెహ్రావత్(31), దీప్తి(25), కిరణ్(24) విలువైన పరుగులు జోడించారు. అయితే, ఆర్సీబీ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో యూపీ గెలుస్తుందన్న అంచనాలు లేవు. 134/8 స్కోరుతో ఓటమి అంచన నిలిచిన ఆ జట్టును ఎక్లోస్టోన్(33) ఆదుకుంది. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆమె ఆర్సీబీ ఆశలపై నీళ్లు చల్లింది. 18 బంతుల్లో 42 రన్స్ చేయాల్సిన స్థితిలో ఎక్లోస్టోన్ రెచ్చిపోయింది. సైమా ఠాకూర్(14) కూడా విలువైన రన్స్ జోడించింది. ఆఖరి ఓవర్‌లో యూపీకి 18 పరుగులు కావాల్సి ఉండగా.. ఆర్సీబీ గెలవాలంటే ఒక్క వికెట్ తీయాలి. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఆర్సీబీ గెలుస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ, ఎక్లోస్టోన్ ఐదు బంతుల్లో వరుసగా 6, 6, 4 దంచి 17 పరుగులు రాబట్టి స్కోరును సమం చేసింది. చివరి బంతికి ఒక్క పరుగు తీస్తే యూపీ గెలిచేది. కానీ, ఎక్లోస్టోన్(33) రనౌటవడంతో యూపీ ఆలౌటడమే కాకుండా మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

సూపర్ ఓవర్‌లోనూ ఎక్లోస్టోన్ మాయ

డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే తొలి సూపర్ ఓవర్. సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన యూపీ 6 బంతుల్లో ఒక్క వికెట్ కోల్పోయి 8 పరుగులే చేసింది. సూపర్ ఓవర్‌లోనూ యూపీ ఆల్‌రౌండర్ ఎక్లోస్టోన్ సత్తాచాటింది. బ్యాటుతో మెరిసి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించిన ఆమె సూపర్ ఓవర్‌లో బంతితో మెరిసింది. 9 పరుగుల లక్ష్యాన్ని కాపాడింది. ఎక్లోస్టోన్ కేవలం 4 పరుగులే ఇవ్వడంతో యూపీని విజయం వరించింది.

Next Story