ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై పోక్సో కేసు నమోదు.. రెండేళ్లుగా అత్యాచారమంటూ ఫిర్యాదు!

by Yella Dhawani Reddy |

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు (Yash Dayal) వరుస చిక్కులు ఎదురవుతున్నాయి.

ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై పోక్సో కేసు నమోదు.. రెండేళ్లుగా అత్యాచారమంటూ ఫిర్యాదు!
X

దిశ, వెబ్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు (Yash Dayal) వరుస చిక్కులు ఎదురవుతున్నాయి. క్రికెట్ మైదానంలో మెరుపులు చూపిన ఈ యువ పేసర్ ప్రస్తుతం తీవ్ర లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే అతడిపై యూపీకి చెందిన ఓ యువతి తీవ్ర లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యువ క్రికెట్ క్రీడాకారిణి తనపై యశ్ దయాళ్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోక్సో కేసు (POCSO Act) నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన ఓ యువ క్రీడాకారిణి యశ్ దయాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను క్రికెట్‌లో పెద్ద స్టార్‌ను చేస్తానని ఆశపెట్టి, గత రెండు ఏళ్లుగా చాలా సార్లు లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా జైపుర్‌లో తొలిసారి యశ్‌ దయాళ్‌ను కలిసినట్లు బాధితురాలు తెలిపింది. క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడుదామని సీతాపురలోని ఓ హోటల్‌కు అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. ఆ తర్వాత బ్లాక్‌మొయిల్ చేస్తూ రెండేళ్ల పాటు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. మొదటిసారి అత్యాచారానికి గురైనప్పుడు ఆమె వయసు 17 ఏళ్లు కావడంతో.. పోక్సో చట్టం కింద దయాళ్‌పై జైపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక యూపీలోని ఘాజియాబాద్‌కు చెందిన ఒక యువతి యశ్ దయాల్ తనను ఐదేళ్లుగా ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి లైంగికంగా, మానసికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఆరోపణలను దయాళ్‌ ఖండించాడు. అనంతరం దీనిపై అలహబాద్‌ హైకోర్టును ఆశ్రయించగా.. యశ్ దయాల్‌ను అరెస్ట్ చేయకుండా తాత్కాలిక స్టే విధించింది. ఈ వరుస లైంగిక ఆరోపణల కారణంగా యశ్ దయాల్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆరోపణలు నిజమని రుజువైతే యశ్ దయాల్‌కు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

కాగా, ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున దయాళ్‌ ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీజన్‌లో 11 వికెట్లు తీశాడు. ఇక 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ కప్ కొట్టింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో ఆర్సీబీ జట్టు గెలవడానికి ముఖ్య పాత్ర పోషించిన వారిలో ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ ఒకరు. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. మొత్తం 13 వికెట్లు తీసి ఆర్సీబీ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవకముందే, అతనిపై వరుసగా లైంగిక ఆరోపణలు వెలువడ్డాయి.

Next Story