నా పని అదే.. కెప్టెన్సీపై జడేజా కీలక వ్యాఖ్యలు..

by Harish |

టీమిండియాకు కెప్టెన్‌గా చేయాలన్న ఆశలు తనకు లేవని భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు.

నా పని అదే.. కెప్టెన్సీపై జడేజా కీలక వ్యాఖ్యలు..
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియాకు కెప్టెన్‌గా చేయాలన్న ఆశలు తనకు లేవని భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తెలిపాడు. ఆ సమయం కూడా చాలా క్రితమే అయిపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రిషబ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమవడంతో జడేజాకు ఆ బాధ్యతలు దక్కాయి. వెస్టిండీస్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జడేజా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. ఓ రిపోర్టర్ కెప్టెన్సీ గురించి అడిగాడు. దానికి జడేజా బదులిస్తూ.. కెప్టెన్సీ గురించి ఆలోచించడం లేదన్నాడు. ప్రస్తుతం తాను జట్టుకు సాధ్యమైనంత వరకూ సహాయం చేయాలనే చూస్తున్నట్టు చెప్పాడు. ‘కుల్దీప్ వచ్చి బౌలింగ్ గురించి అడిగితే నా అభిప్రాయం చెబుతాను. కొన్నిసార్లు జైశ్వాల్ రావచ్చు. ఎవరైనా రావచ్చు. నేను ఏం ఫీల్ అవుతున్నానో వాళ్లతో పంచుకుంటా. పిచ్, పరిస్థితుల ఆధారంగా ఎలా ఆడాలో చెబుతాను. కానీ, కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ గురించి ఆలోచించడం లేదు.’అని చెప్పుకొచ్చాడు.

వన్డే వరల్డ్ కప్-2027 ఆడాలని ఉంది

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై జడేజా స్పందించాడు. తనకు ఆడాలని ఉందని, కానీ అది తన చేతుల్లో లేదన్నాడు. టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు, కోచ్, కెప్టెన్‌‌లకు వారి సొంత ఆలోచనలు ఉంటాయని చెప్పాడు. అయితే, తనను సెలెక్ట్ చేయడం లేదని సెలెక్టర్లు తనకు ముందే చెప్పారని, ఎంపిక చేయకపోవడానికి కారణాలు వివరించారని తెలిపాడు. అవకాశం వస్తే శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పాడు. అలాగే, 2027లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడాలని ఉందని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తాను వ్యక్తిగత రికార్డుల కోసం ఆడనని, జట్టు ప్రదర్శన గురించే ఆలోచిస్తానని చెప్పాడు.


Next Story