Ranji Trophy : నిప్పులు చెరిగిన సిరాజ్.. చత్తీస్‌గఢ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు

by Harish |

Ranji Trophy : నిప్పులు చెరిగిన సిరాజ్.. చత్తీస్‌గఢ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీలో చత్తీస్‌గఢ్‌తో గురువారం ప్రారంభమైన చివరి గ్రూపు మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ చెలరేగాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ మెరవడంతో ఈ మ్యాచ్‌‌‌లో హైదరాబాద్‌కు మంచి ఆరంభమే దక్కింది. ముందుగా బ్యాటింగ్ చేసిన చత్తీస్‌గఢ్‌ తొలి రోజే 283 పరుగులే చేసి ఆలౌటైంది. 58 పరుగులకే ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ స్థితిలో ప్రతీక్(106), వికల్ప్ తివారి(94) సంచలన ఇన్నింగ్స్ ఆడి టీమ్‌ను ఆదుకున్నారు. వారిద్దరూ తప్ప మిగతా వారెవరూ కనీసం క్రీజులో కూడా నిలవలేకపోయారు. ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే పరిమితం చేయడంలో సిరాజ్‌ది కీలక పాత్ర. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అనుజ్ తివారి(4), సంజీత్ దేశాయ్(16), వికల్ప్, ఆదిత్య(4)‌లను అవుట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 56 రన్స్ చేసింది. అమన్ రావు(32 బ్యాటింగ్), అభిరత్(23 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ భారీ స్కోరు చేస్తే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. గ్రూపు డిలో 5వ స్థానంలో ఉన్న హైదరాబాద్ క్వార్టర్ ఫైనల్స్‌ చేరుకోవడం దాదాపు అసాధ్యమే.


Next Story