Womens World Cup : పాక్‌ ఆశలపై వరుణుడు నీళ్లు.. అలవోకగా గెలిచే మ్యాచ్ వర్షార్పణం

by Harish |

మహిళల వరల్డ్ కప్‌‌‌‌లో పాకిస్తాన్ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు.

Womens World Cup : పాక్‌ ఆశలపై వరుణుడు నీళ్లు.. అలవోకగా గెలిచే మ్యాచ్ వర్షార్పణం
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల వరల్డ్ కప్‌‌‌‌లో పాకిస్తాన్ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. టోర్నీలో ఇంకా గెలుపు ఖాతా తెరవని ఆ జట్టుకు వరుణుడు గట్టి షాకిచ్చాడు. బుధవారం ఇంగ్లాండ్‌పై అలవోకగా గెలిచే స్థితిలో ఉండగా పాక్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది. కొలంబో వేదికగా జరిగిన ఇంగ్లాండ్, పాక్ మ్యాచ్ వర్షార్పణమైంది. ముందుగా ఇంగ్లాండ్‌ చేయగా 25 ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. పాక్ బౌలర్ ఫాతిమా సనా 4 వికెట్లతో రెచ్చిపోవడంతో ఆట నిలిచే సమయానికి ఇంగ్లాండ్ 78 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. చాలా సేపటి తర్వాత మ్యాచ్ తిరిగి ప్రారంభమవ్వగా రెండు ఇన్నింగ్స్‌లను 31 ఓవర్లకు కుదించారు. ఇంగ్లాండ్ 31 ఓవర్లలో 9 వికెట్లే కోల్పోయి 133 పరుగులే చేసింది. అయితే, డీఎల్‌ఎస్ పద్ధతిలో పాక్ లక్ష్యాన్ని 113గా నిర్ణయించారు.

దీంతో పాక్ అలవోకగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ, పాక్‌ను వరుణుడు భారీ దెబ్బ కొట్టాడు. ఛేదనలో 7వ ఓవర్ కొనసాగుతుండగా మళ్లీ వర్షం అడ్డు తగిలింది. అప్పటికి పాక్ వికెట్ నష్టపోకుండా 34 రన్స్ చేయగా ఇంకా 79 రన్సే చేయాలి. కానీ, ఆట తిరిగి నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు అయినట్టు ప్రకటించారు. దీంతో సులభంగా గెలిచే మ్యాచ్‌ పాక్‌కు దూరమైంది. ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. టోర్నీలో ఒక్క మ్యాచ్ గెలవని పాక్ పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో ఉన్నది. కొలంబోలో పడుతున్న వర్షాలు ప్రపంచకప్‌కు అడ్డంకిగా మారాయి. వర్షం కారణంగా రద్దయిన రెండో మ్యాచ్ ఇది. కొలంబోలోనే మంగళవారం శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన గేము కూడా వర్షార్పణమైన విషయం తెలిసిందే.


Next Story